Take a fresh look at your lifestyle.

ఉద్యానవన పంటలతో అధిక లాభం పొందవచ్చు

 

మహదేవపూర్, ముద్ర:

రైతులు పంట మార్పిడి విధానం అనుసరిస్తే అధిక ఆదాయం పొందవచ్చని ఉద్యానవన శాఖ జిల్లా అధికారి ఏ సునీల్ కుమార్ తెలిపారు. అలాగే పండ్ల తోటల పెంపకం, కూరగాయల తోటల సాగు, ఆయిల్ పామ్ పంటల సాగు చేపట్టడం ద్వారా రైతులు మంచి లాభాలు పొందవచ్చని వివరించారు. ప్రభుత్వం తరఫున ఉద్యాన పంటల ప్రోత్సాహం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలు, తోటల స్థాపనకు రాయితీలు, డ్రిప్ ఇరిగేషన్, మల్చింగ్, షేడ్ నెట్ హౌస్‌లు మరియు ఇతర సాంకేతిక సహాయాల గురించి రైతులకు వివరించారు. టేకుమట్ల మండలంలోని పంగిడిపల్లి గ్రామంలో బుధవారం జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగుపై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గ్లోబల్ డ్రిప్ కంపెనీ సహకారంతో రైతులకు డ్రిప్ పరికరాలపై విక్రయానంతర సేవలు మరియు వినియోగంపై శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం, రామగిరిఖిల్లా నుండి కీటక శాస్త్రవేత్త డా. వై. వెంకన్న పాల్గొని ఉద్యాన పంటలలో వచ్చే వివిధ చీడపీడల సమస్యలు మరియు వాటి నివారణ చర్యలపై రైతులకు వివరించారు. అనంతరం ఉద్యాన మిషన్ పథకం ద్వారా రైతులకు కూరగాయల మినీ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి ఎం. కళ్యాణి, వ్యవసాయ విస్తరణ అధికారి రాహుల్, ఉద్యాన విస్తరణ అధికారి రామాచారి, పంగిడిపల్లి మరియు పెద్దపల్లి గ్రామాల సర్పంచులు, గ్లోబల్ కంపెనీ ఏరియా మేనేజర్ సుదర్శన్, రామ్మూర్తి లింగారెడ్డి, ఆయిల్ పామ్ కంపెనీ ప్రతినిధి రమేష్, రైతులు రాజిరెడ్డి, సత్యం రెడ్డి, మాదాసి మహేందర్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.