మహాదేవపూర్, ముద్ర:
సరస్వతి అంత్య పుష్కరాలకు అవసరమైన అన్ని విద్యుత్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు.విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.మొత్తం 330 ఎనిమిది మీటర్ల ఎత్తు గల స్తంభాలు, 152 తొమ్మిది మీటర్ల స్తంభాలు, 8 పదకొండు మీటర్ల స్తంభాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా సుమారు 5 కి.మీ. 11 కేవీ లైన్, 12 కి.మీ. ఎల్‌టీ లైన్ వేయడం పూర్తయినట్లు వెల్లడించారు. మొత్తం 18 ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.నిరంతరాయ విద్యుత్ సరఫరా నిర్వహణ కోసం 16 కీలక ప్రాంతాలలో 12 రోజుల పాటు రాత్రింబగళ్లు పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. విధుల్లో 4 మంది డివిజనల్ ఇంజినీర్లు, 6 మంది అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్లు, 13 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, 12 మంది సబ్ ఇంజినీర్లు, 13 మంది లైన్ ఇన్స్పెక్టర్లు, 9 మంది లైన్మెన్లు, 45 మంది అసిస్టెంట్ లైన్మెన్లు తదితర సిబ్బంది కలిపి మొత్తం 150 మంది విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు విఫలమైన సందర్భంలో వెంటనే మార్పిడి చేయడానికి అదనపు స్పేర్ ట్రాన్స్‌ఫార్మర్లను కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. దేవాలయం, టెంట్ సిటీ, వీఐపీ ఘాట్, మెయిన్ ఘాట్, హరిత హోటల్ తదితర కీలక ప్రాంతాలకు డబుల్ ఫీడింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఒక ఫీడర్‌లో అంతరాయం ఏర్పడినప్పటికీ మరో ఫీడర్ ద్వారా వెంటనే విద్యుత్ సరఫరా అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.అలాగే బ్రేక్‌డౌన్ పరిస్థితుల్లో ప్రత్యేక బ్రేక్‌డౌన్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు.