- సమ్మెతో రవాణా వ్యవస్థ స్తంభించి.. ప్రజలు ఇబ్బందిపడతారు.
- మీ సమస్యలు వినేందుకు నేను, సీఎం ఎప్పుడు సిద్ధం.
- 16 నెలల్లో ఏనాడైనా మిమ్మల్ని ఇబ్బందిపెట్టామా..?
- ఆర్టీసీ కార్మిక సంఘ నేతలతో రవాణా శాఖ మంత్రి పొన్నం.
ముద్ర, తెలంగాణ బ్యూరో : సమ్మె విషయంలో ఆర్టీసీ కార్మికులు పునరాలోచన చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.తొందరపడి నిర్ణయాలతో రాష్ట్రంలో కీలకమైన రవాణా వ్యవస్థను స్తంభింపజేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. టీజీఎస్ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందన్న ఆయన సమస్యలూ ఒక్కొక్కటిగా తొలిగిపోతున్నాయని వెల్లడించారు.16 నెలల కాంగ్రెస్ పాలనలో ఎన్నో మంచి కార్యక్రమాలు చేశామనీ ఏనాడైనా, ఏ ఇబ్బంది పెట్టామా? అని మంత్రి ప్రశ్నించారు. సొమవారం మినిస్టర్ క్వార్టర్స్ లో పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు.ఈ సందర్భంగా ఆర్టీసీ సంఘాల నేతలు ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా,ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పుకోవచ్చని తెలిపారు.తాను అందుబాటులోనే ఉంటా అని భరోసా ఇచ్చారు.ఆర్టీసీ సమస్యలు వినడానికి సీఎం కార్యాలయం తలుపులు సైతం ఎప్పుడూ తెరిచే ఉంటాయన్నారు.ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు.ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడుతారని చెప్పారు.గత 10 ఏళ్లుగా ఆర్టీసీని నిర్వీర్యం చేశారని, ఒక్క బస్సు కొనుగోలు చేయలేదని ఆరోపించారు. ఒక్క ఉద్యోగం కూడా నియామకం చేపట్టలేదన్నారు. సీసీఎస్, పీఎఫ్ పైసలు వాడుకున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు 2013 నుంచి చెల్లించాల్సిన బాండ్ మొత్తం రూ.400 కోట్లను తమ ప్రభుత్వం చెల్లించిందని మంత్రి తెలిపారు. 2017 పే స్కేల్ 21శాతం ఇవ్వడంతో సంవత్సరానికి రూ.412 కోట్ల భారం పడుతుందని తెలిపారు.పీఎఫ్ ఆర్గనైజేషన్ సుదీర్ఘ కాలంగ పెండింగ్‌లో ఉన్న రూ.1039 కోట్లు చెల్లించామన్నారు.నెలవారీ పీఎఫ్, సీసీఎస్ కంట్రిబ్యూషన్ గతేడాది జనవరి-నుంచి క్రమం తప్పకుండా చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు.చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న సీసీఎస్ బకాయిలు ఉద్యోగులకు రూ. 345 కోట్లు చెల్లించామని మంత్రి వివరించారు.దాదాపు 1500 మంది కారుణ్య నియామకాలు చేపట్టినట్లు తెలిపారు.టీజీఎస్ఆర్టీసీలో 3038 మంది ఉద్యోగులను రిక్రూట్‌మెంట్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తుకు చేశారు.కొత్త బస్సులు కొనుగోలు చేశామని, తార్నాక ఆసుపత్రి ను సూపర్ స్పెషాలిటీ గా మార్చామని మంత్రి వివరించారు.మంత్రిని కలిసిన వారిలో ఆర్టీసీ జేఏసీ చైర్మన్ టీఎంయూ జనరల్ సెక్రటరీ అశ్వద్ధామ రెడ్డి, ఎన్ఎంయూ జనరల్ సెక్రెటరీ నరేందర్, కార్మిక సంఘ్ జనరల్ సెక్రెటరీ ఎర్ర స్వామి కుమార్, ఎస్‌టీఎంయూ జనరల్ సెక్రెటరీ పున్న హరి కృష్ణ పలువురు ఆర్టీసీ సంఘాల నేతలు ఉన్నారు.