ఎయిమ్స్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ అమిత అగర్వాల్
బీబీనగర్, ముద్ర ప్రతినిధి: బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) అభివృద్ధికి, నూతన ఆవిష్కరణలకు అందరం జట్టుగా కలిసి పనిచేద్దామని నూతన కార్యనిర్వాహక సంచాలకుడు ప్రొఫెసర్ అమిత అగర్వాల్ పిలుపుని
చ్చారు. ఎయిమ్స్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె అధ్యాపకులు, సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రత్యక్ష అవగాహన కోసం తాను ప్రతి విభాగాన్ని స్వయంగా పరిశీలించి అక్కడి కార్యకలాపాలు, వారి అవసరాలను తెలుసుకుంటానని అన్నారు. సమష్టిగా బీబీనగర్ లోని ఎయిమ్స్ సమగ్ర అభివృద్ధి, విద్యా పురోగతి కోసం ఒక వ్యూహాత్మక రోడ్ మ్యాప్ ను రూపొందించడానికి వీలుగా తన సందర్శన దోహదపడుతుందని తెలిపారు. అంతకుముందు నూతన కార్యనిర్వాహక సంచాలకులుగా బాధ్యతలు స్వీకరించిన ఆమెకు సంస్థలోని అధ్యాపకులు, సిబ్బంది సాదర స్వాగతం పలికారు.
ఆమె నాయకత్వంలో ఎయిమ్స్ ప్రగతి మరింత పురోగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాలలో నైపుణ్యం మరింత బలోపేతం కాగలవన్న ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్త పరిచారు. పుష్పగుచ్ఛాలు, శాలువాలతో నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను అధ్యాపకులు, సిబ్బంది సత్కరించారు.