Take a fresh look at your lifestyle.

త్వరలో డీలిమిటేషన్ పెరగనున్న అసెంబ్లీ సీట్లు

  • వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి.
  • మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి.
  • జమిలీ ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతున్నది.
  • పార్టీ కోసం పని చేస్తేనే పదవులు వెతుక్కుంటూ వస్తాయి.
  • త్వరలో కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయి.
  • స్ధానిక సంస్థల ఎన్నికల్లో వారిని గెలిపించుకోవాలి.
  • తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేదు.
  • జగ్గారెడ్డి ఓడిపోయినా… నిర్మలా జగ్గారెడ్డిని కార్పొరేషన్ ఛైర్మన్ చేశాం.
  • జులై 4 న హైదరాబాద్‌కి ఖర్గే రాక.
  • అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం.
  • పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి.

ముద్ర, తెలంగాణ బ్యూరో : రానున్న రోజుల్లో కాంగ్రెస్​ అనేక సవాళ్లు ఎదుర్కోబోతోందని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్‌,జమిలి ఎన్నికల వంటి అనేక అంశాలు మన ముందుకు రాబోతున్నాయని వెల్లడించారు.కేంద్రంలోని బీజేపీ సర్కార్​ జమిలీ ఎన్నికలకు వడివడిగా అడుగులేస్తోందన్నారు. భవిష్యత్తు సవాళ్లను దృష్టిలో పెట్టుకుని ప్రతి కాంగ్రెస్​ కార్యకర్త సుశిక్షితుడైన సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి తిరిగే లేదన్నారు.మంగళవారం గాంధీభవన్ లో జరిగిన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.తర్వాత టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.అనంతరం పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని సీఎం చెప్పారు. ముఖ్యంగా మహిళా సీట్లు పెరుగుతాయని చెప్పారు.ఆయా స్ధానాల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో ఎంతో మంది పదవుల కోసం పోటీ పడ్డారన్నారు.మీరంతా పార్టీ నిర్మాణంలో కీలక భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. పార్టీలో కష్టపడితే కచ్చితంగా పదవులు వస్తాయని ఇప్పుడున్న చాలా మంది నేతలు కింది స్థాయి నుంచి వచ్చారని సీఎం అన్నారు.కాంగ్రెస్ పార్టీతోనే తన ఎదుగుదల సాధ్యమైందన్నారు. పార్టీ బాధ్యత మోసిన వారికే ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ అభివృద్ధికి కృషి చేస్తే పదవులు అవే వెతుక్కుంటూ వస్తాయని చెప్పారు. తనతో పాటు పాటు పార్టీ బాధ్యతలు మోసిన 65 మందికి ప్రభుత్వంలో పదవులు ఇచ్చామన్నారు. పార్టీ పదవులు వచ్చాయని పనిచేయకపోతే వారిని పీసీసీ అధ్యక్షుడు పక్కన పెడతారని హెచ్చరించారు.ఇందులో ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. త్వరలోనే కార్యకర్తల ఎన్నికలు రాబోతున్నాయన్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవాలని మంత్రులు, కీలక నాయకులకు సూచించారు.వచ్చే నెల 4 న హైదరాబాద్‌కి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే వస్తున్నట్లు సీఎం తెలిపారు. అదే రోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.

  • పదేండ్ల అధికారం నాదే బాధ్యత.

ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు టీడీపీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతోందన్నారు.ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు.పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు. రెండోసారి అధికారంలోకి రావడం కార్యకర్తల చేతుల్లో ఉందని, ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు అందుబాటులోకి తేవాలన్నారు.పార్టీ పదవులను చిన్నచూపు చూడవద్దని ఈ పార్టీ పదవులే మిమ్మల్నీ పెద్ద నాయకులుగా తీర్చిదిద్దుతుందన్నారు.పార్టీ నిర్మాణంలో బాధ్యత తీసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.అధికారం వచ్చిన ఏడాదిలోనే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. కేవలం 18 నెలల్లోనే రైతుల కోసం రూ. 1.04లక్ష కోట్లు ఖర్చు పెట్టామన్నారు.దేశంలో ఏ ప్రభుత్వం రైతుల కోసం ఇంత ఖర్చు చేయలేదని తెలిపారు.దీంతో పాటు వందేళ్ల ఏళ్ల కులగణన కలను తమ పాలనలోనే నెరవేర్చినట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేసి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి సవాల్ విసిరామని చెప్పారు.కేంద్రం మెడలు వంచి దేశం లో కులగణన చేపట్టాలని నిర్వహించేలా చేశామన్నారు. ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించామన్నారు.ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోందని సీఎం వ్యాఖ్యానించారు.

  • గీత దాటితే వేటు తప్పదు.

త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగనున్న నేపథ్యంలో పార్టీలో పలువురు నేతల వ్యవహార శైలీపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ మనుగడును ప్రమాదంలో పడేసే నాయకుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ల తీరుపై మండిపడ్డారు. మంత్రి పదవుల కోసం కొంతమంది కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేయించడంపై రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే, ఇబ్బందులకు గురి చేసే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. పార్టీలో క్రమశిక్షణ దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పదవులు వచ్చినవారు రాష్ట్రమంతా తిరగాలని ఆదేశించారు. పదవులు అడగటం తప్పు లేదన్న సీఎం.. వాటి కోసం చేపట్టే నిరసన హుందాగా ఉండాలని సూచించారు. పీసీసీ కార్యవర్గంలో ఉన్న వారిని రెండుగా చేసి జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. ముందు అందరికీ పని అప్పగించాలని సూచించారు. పని చేసిన వాళ్లది ఒక జాబితా, పనిచేయని వాళ్లది మరో జాబితా సిద్ధం చేయాలని సీఎం నిర్దేశించారు. ఇన్‌చార్జ్ మంత్రుల పనితీరుపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా జిల్లాల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసే బాధ్యత ఇన్‌చార్జ్ మంత్రులకు అప్పగించినా ఎందుకు చేయడం లేదని ప్రశ్నిచారు. వెంటనే మార్కెట్‌, టెంపుల్‌ కమిటీల్లో నామినేషన్‌ పోస్టులు భర్తీ చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 99 శాతం సీట్లు గెలిచేలా ఇన్‌చార్జ్ మంత్రులే బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రులకు నిధులు ఇచ్చామని, వాటిని సరిగ్గా ఎందుకు ఆయా జిల్లాల్లో ఉపయోగించడం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. పని చేయకపోతే డిమోషన్.. పని చేస్తే ప్రమోషన్ ఇస్తామని స్పష్టం చేశారు. పని చేయకపోతే పక్కన పెట్టడంలో మొహమాటం అవసరం లేదని తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్ధం చేయాలని కార్యవర్గాన్ని సూచించారు. పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

  • విభేదాల పరిష్కారానికి సమన్వయ కమిటీలు : ఏఐసీసీ ఇన్​ ఛార్జీ.

పార్టీ కోసం కష్టపడే వారికి తప్పకుండా వివిధ కమిటీల్లో, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని ఏఐసీసీ ఇన్​ చార్జీ మీనాక్షీ నటరాజన్ హామీ ఇచ్చారు. పార్టీని గ్రామ, మండల, జిల్లా స్థాయిలో బలోపేతం చేయడానికి క్షేత్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో పంచాయతీ సంఘటన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు. పార్టీలో అంతర్గత విభేదాలు, కొత్త నాయకులతో సమన్వయ లోపాలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రతి జిల్లాకు ఇద్దరు అబ్జర్వర్‌లను నియమించి కమిటీల్లో నిబద్ధత కలిగిన కార్యకర్తలను గుర్తించాలని సూచించారు. 42శాతం బీసీ కోటా, ఎస్సీ వర్గీకరణ, కులగణన వంటి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చేరవేయాలని, బీజేపీ, బీఆర్ఎస్ అసత్య ప్రచారాలను ఎదుర్కోవాలని మీనాక్షీకార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్​ గౌడ్​, మంత్రులు దామోదర రాజనర్సింహా, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్​, పొన్నం ప్రభాకర్​, మాజీ ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.