- మాజీ సీఎం కేసీఆర్ కు.. సీఎం రేవంత్ రెడ్డి సవాల్.
- ఏపీ ప్రాజెక్టుపై చర్చ కోసం కేసీఆర్ స్పీకర్ కు లేఖ రాయాలి.
- గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా?
- చంద్రబాబుతో కలిసి ఉండే వాడినే అయితే అప్పుడే వెళ్లే వాడిని.
- కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కలిసిపోయినయ్.
- కేసీఆర్ కాంట్రాక్టర్లకు రూ.2 లక్షల కోట్లు చెల్లించిండు.
- రూ. వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయింది?
- రూ. 300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా,రూ.200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు?
- రూ. 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు ఎందుకు ఆగిపోయింది.
- దేవాదుల పూర్తి చేస్తే 4 వేల ఎకరాలు సాగయ్యేవి.. ఎందుకు పూర్తి చేయలేదు.
- సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన.
- రైతు భరోసా విజయోత్సవ సభలో ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తోన్న గోదావరి–బనకచర్ల (జీబీ) లింక్ ప్రాజెక్ట్ పై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఏపీ నిర్మిస్తోన్న ఆ ప్రాజెక్టు నిర్మాణానికి మీరు వ్యతిరేకం అయితే ఆ విషయంలో మీకు చిత్తశుద్ధి ఉంటే బనకచర్లపై శాసనసభలో చర్చకు ముందుకు రావాలన్నారు. ఆ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు లేఖ రాయాలని డిమాండ్ చేశారు. మీరు చెప్పిన తేదిన అసెంబ్లీ పెట్టించే బాధ్యత మంత్రి శ్రీధర్ బాబు తీసుకుంటారని వ్యాఖ్యానించారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసింది మీరా..? నేనా..? అనేది ఆ చర్చలో తేల్చుకుందాం అని సవాల్ చేశారు. గోదావరి నీటి పై ఒకరోజు, కృష్ణా నీటిపై ఒకరోజు అసెంబ్లీలో చర్చిద్దామన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తానని చెప్పింది ఎవరో ఆధారాలు సహా చెబుతానని వెల్లడించారు. తెలంగాణకు సీఎంగా ఉండీ.. రాష్ట్రానికి మరణ శాసనం రాసిన చరిత్ర కేసీఆర్ ది అన్నారు. కేసీఆర్ హయాంలో ఏపీ ముచుమర్రి ప్రాజెక్టును నిర్మించిందన్న రేవంత్ రెడ్డి.. పోతిరెడ్డిపాడు పొక్క పెద్దది చేసిందని గుర్తు చేశారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ముందు జరిగిన రైతు భరోసా విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2016లో గోదావరిలోకి 3 వేల టీఎంసీలు వెళ్తున్నాయని చెప్పింది మీరు కాదా? అని నిలదీశారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని చెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.
- కాళేశ్వరం కూలేశ్వరం అయింది.
పదేళ్ల బీఆర్ఎస్ పాలన, 18 నెలల కాంగ్రెస్ పాలన ఎలా ఉందో బేరీజు వేసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఙప్తి చేశారు. మాజీ సీఎం కేసీఆర్.. కుట్రలు కుతంత్రాలతో కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను ఒక్కటి కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం కూలేశ్వరమై ఆ ప్రజాధనం అంతా గోదావరిలో కలిసిపోయిందన్నారు. ప్రాజెక్టు కూలిపోయినందుకు కేసీఆర్ ను కాళేశ్వరంలోనే ఉరి తీసినా తప్పు లేదని అక్కడి రైతాంగం డిమాండ్ చేస్తోందన్నారు. సీఎంగా కేసీఆర్.. ప్రాజెక్టులు నిర్మించిన కాంట్రాక్టర్లకు రూ. 2 లక్షల కోట్లు చెల్లించారన్నారు. కానీ రూ. వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన కల్వకుర్తి ఎందుకు ఆగిపోయిందో సమాధానం చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు. అలాగే రూ. 300 కోట్లతో పూర్తి కావాల్సిన బీమా, రూ. 200 కోట్లతో పూర్తి కావాల్సిన నెట్టెంపాడు ఎందుకు పూర్తి కాలేదు? రూ. 6 వేల కోట్లతో పూర్తి కావాల్సిన సీతారామ ప్రాజెక్టు మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది.?అని నిలదీశారు. దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేస్తే 4వేల ఎకరాలు సాగయ్యేవనీ అయినా గత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాజెక్టులపై సీమాంధ్రులు నిర్లక్ష్యం వహించారని చెబుతోన్న కేసీఆర్.. పదేళ్లలో ఇంకొక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా..? అని ప్రశ్నించారు. ఈ దుర్మార్గానికి నువ్వు, నీ కుటుంబం కారణం కాదా? అని దుయ్యబట్టారు. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో రూ. లక్ష కోట్లు దోచుకుని..వేల ఎకరాలు ఆక్రమించుకున్న కేసీఆర్.. బనకచర్ల విషయంలో తనపై దుర్మార్గపు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను , టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో అంటకాగాలనుకుంటే అక్కడే ఉండేవాన్ని అన్నారు. రాజీవ్ గాంధీ ఆశీర్వాదం తీసుకునేందుకు ఇక్కడికి ఎందుకు వచ్చేవాడిని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మను నమ్మకద్రోహం చేసిన చరిత్ర నీదైతే… తెలంగాణలో ప్రజా ప్రభుత్వం తేవాలని చంద్రబాబును కాదని కాంగ్రెస్ లో చేరి ప్రజలతో కదం కదం కలిపిన నైజం తనదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాకు అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ పార్టీలో కి వచ్చినట్లు సీఎం చెప్పారు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తానని మోసం చేయలేదన్నారు.
- అప్పడు, ఇప్పుడు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటీ..?
తెలంగాణ రాష్ట్రం రాకముందు మీ ఆర్ధిక పరిస్థితి ఏంటి? ఆ తర్వాత ఏంటీ అని సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ ను ప్రశ్నించారు. మొయినాబాద్ లో హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎలా వచ్చింది ? జన్వాడలో కేటీఆర్ కు,గజ్వేల్ లో కేసీఆర్ కు ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయి..? మీరు రూ. వేల కోట్ల అధిపతులు ఎలా అయ్యారు..? రాష్ట్రానికి రూ. 8 లక్షల కోట్ల అప్పు ఎలా అయింది..? అని సమాధానం చెప్పాలన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం నిజాం నవాబుల కంటే ఫణవంతులయ్యారని వ్యాఖ్యానించారు. కానీ ధనిక రాష్ట్రమైన తెలంగాణ మాత్రం దివాళా తీసిందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వారు చేయలేని పనులు, ప్రగతి తాము మొదటి ఏడాదిలోనే చేపి చూపించామన్నారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో 60 వేల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశామన్నారు. లెక్కబెట్టుకుంటమంటే ఎల్బీ స్టేడియంలో తలలు లెక్కగట్టి అప్పచెప్పి నిరూపిస్తానన్నారు. పదేండ్లలో మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో ప్రజలకు సమాధానం చెప్పాలని కేసీఆర్ ను డిమాండ్ చేశారు. 18 నెలల్లో కేవలం రైతుల కోసమే రూ. 1.04లక్ష కోట్లు ఖర్చు చేసిన రైతు ప్రభుత్వం తమదన్నారు. రైతును రాజుగా చేసి వ్యవసాయాన్ని పండుగ చేసిన ప్రజా పాలన కాంగ్రెస్ ది అన్నారు. దీనిపై చర్చకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా సవాల్ విసిరారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రూ. లక్ష కోట్లు కొల్లగొడితే.. 18 నెలల్లో రైతుల కోసం రూ.1.04 లక్ష కోట్లు ఖర్చు చేసి రైతులను ఆదుకున్న చరిత్ర తమదన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి,సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి , హర్కర వేణుగోపాల్ రావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.
