Take a fresh look at your lifestyle.

విజయోత్సవాలు కాదు.. రైతులకు క్షమాపణ చెప్పాలి

  • స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు.
  • 19 నెలల కాలంలో రైతన్నను అరిగోస పెట్టుకున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. 
  • రైతులకు ఏం చేశావని సంబరాలు చేస్తున్నావ్ రేవంత్ రెడ్డి? 
  •  ధ్వజమెత్తిన మాజీ మంత్రి హరీశ్ రావు.

ముద్ర, తెలంగాణ బ్యూరో: విజయోత్సవాలు కాదు..రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులను అన్నింటా మోసం చేసిందని విమర్శించారు.మరోసారి వారిని మోసం చేయడానికే స్థానిక సంస్థల ఎన్నికల ముందు రైతు భరోసా పేరిట ఆడుతున్న డ్రామాలు ఆడుతోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఎకరాకు రూ. 15,000 చొప్పున ఇస్తామని చెప్పి రూ. 12,000 కి పరిమితం చేయడం మోసం చేయడమేనని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు.గత వానకాలం రైతు భరోసా ఎగ్గొట్టి, యాసంగిలో ఎగ్గొట్టి, ఓట్ల కోసం ఇప్పుడు విజయోత్సవాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు జరపడం రైతులను మోసం చేయడమేనని అన్నారు. చెప్పింది కొండంత, చేసింది గోరంత అని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో రైతులను మభ్య పెట్టిన రేవంత్ అధికారంలోకి వచ్చాక నిండా ముంచాడన్నారు.రైతులకు ఏం చేసిందని  రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబురాలు చేస్తుందని  ప్రశ్నించారు. బిఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఆందోళన లేకుండా ఉన్న రైతన్న నేడు ప్రభుత్వ పథకాలు అందక పంట పొలాల్లోనే కుప్ప కూలుతున్నాడన్నారు.బీఆర్ఎస్ ది రైతు సంక్షేమ ప్రభుత్వం అయితే, కాంగ్రెస్ ది రైతు సంక్షోభ ప్రభుత్వమన్నారు. కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే, మీరు ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇచ్చి మభ్య పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు..స్థానిక ఎన్నికల నేపథ్యంలో చేస్తున్న రేవంత్ జిమ్మిక్కులను రైతులు నమ్మరన్నారు.రైతులను కన్నీళ్లు పెట్టించినందుకు, ఉసురు తీసుకున్నందుకు విజయోత్సవాలు కాదు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.