- తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించండి.
- ఫ్రెంచ్ కంపెనీలు ఇక్కడికొచ్చేలా చొరవ చూపండి.
- ‘ఇఫ్కీ’ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు విజ్ఞప్తి.
ముద్ర, తెలంగాణ బ్యూరో: భావితరాల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించబోతున్న ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేలా ఫ్రెంచ్ కంపెనీలను ప్రోత్సహించాలని ‘ఇండో – ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఇఫ్కీ)’ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. మంగళవారం సచివాలయంలో ఇఫ్కీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున అందిస్తున్న ప్రోత్సాహాకాలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ‘తెలంగాణ బ్రాండ్ ను విశ్వవ్యాప్తం చేయాలనే దూరదృష్టితోనే సీఎం రేవంత్ రెడ్డి 30వేల ఎకరాల్లో పీపీపీ విధానంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. ఇది ఒక నగరం కాదు భవిష్యత్తు అని అన్నారు.అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఈ నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. ‘ఏడాదిన్నర వ్యవధిలోనే తెలంగాణకు రూ.3 లక్షల కోట్ల పెట్టబడులొచ్చాయి. గతేడాది హైదరాబాద్ లో 70 జీసీసీలు ప్రారంభమయ్యాయి. పారిశ్రామికవేత్తలకు మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పరిశ్రమలకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిభ గల మానవ వనరులకు కొరత లేదన్నారు.మరింత వేగంగా సరళంగా..పారదర్శకంగా అనుమతులిచ్చేందుకు టీజీ–ఐపాస్ ను ఏఐతో అనుసంధానం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.‘ఏరో స్పేస్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ లాంటి రంగాల్లో పలు ఫ్రెంచ్ కంపెనీలు ఇప్పటికే తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయన్నారు. సనోఫి, మోనిన్, సఫ్రాన్, క్యాప్ జెమినీ, డసాల్ట్, టెలీ పర్ ఫార్మెన్స్, ఓపెల్లా హెల్త్ కేర్ లాంటి దిగ్గజ సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఎమర్జింగ్ టెక్నాలజీస్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ, డిజిటల్ గవర్నెన్స్, ఆగ్రో ఇన్నోవేషన్, స్మార్ట్ హెల్త్ సిస్టమ్స్, ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్, సస్టైనబుల్ మ్యానుఫాక్చరింగ్ తదితర రంగాల్లో మంచి అవకాశాలున్నాయన్నారు. దీన్ని ఫ్రాన్స్ పారిశ్రామికవేత్తలు సద్వినియోగం చేసుకునేలా చొరవ చూపండి అని ఇఫ్కీ ప్రతినిధులను కోరారు. ‘తెలంగాణ – ఫ్రెంచ్’ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.కార్యక్రమంలో ఇఫ్కీ నుంచి యోహాన్ సామ్యూల్, ప్రియాంక్ ప్రకాష్, నకుల్ దల్వాలా, మోనిన్, ఓపెల్లా హెల్త్ కేర్, సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియా, సనోఫీ ఇండియా, టెలిపర్ ఫార్మెన్స్, వార్ ఎలక్ట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, జీగ్లర్ ఏరోస్పేస్ తదితర పలు ఫ్రెంచ్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
