Take a fresh look at your lifestyle.

జిల్లా సహకార బ్యాంకర్లతో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సమీక్ష

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి :
ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో బ్యాంకుల లావాదేవీలు , ఆర్థిక పరిస్థితిపై మంగళవారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయములో పర్సన్ ఇన్‌చార్జ్ ఛైర్పర్సన్ ,జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ఆదాయం-ఖర్చుల సమతుల్యత, రుణాల మంజూరు, వసూళ్ల పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడానికి సమన్వయంతో పనిచేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న రుణాల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే, రైతులకు ,ఖాతా దారులకు సులభమైన, నాణ్యమైన బ్యాంకింగ్ సేవలు అందించే దిశగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో పాలకవర్గం సభ్యులతో మహాజన సభ 2026-27 బడ్జెట్ సమావేశం నిర్వహించారు . ఈ సమావేశానికి డీసీసీబీ ఇన్‌చార్జ్ చైర్‌పర్సన్ ,జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య హాజరై అధ్యక్షత వహించారు.
ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ఖర్చుల వివరాలను సమీక్షించి, ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.75,24,60,000 బడ్జెట్ అంచనాను సిద్ధం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్‌ను పాలకవర్గం ఆమోదించింది. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితిగతులు, ఆదాయం-ఖర్చుల సమతుల్యత, డిపాజిట్ల వృద్ధి, రుణాల మంజూరు, లోన్ రికవరీలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా పిఎసిఎస్ సంఘాల ద్వారా రుణాల వసూళ్లు, దీర్ఘకాలిక , లాంగ్ స్టాండింగ్ రుణాల రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు .
అలాగే ఈనెల 28 నాటికి పరిపాలన నివేదిక , ఆర్థిక పట్టికలను సమీక్షించి, మహాజన సభకు సమర్పించారు .
సభ అజెండాలో గత సమావేశాల , తీర్మానాల ధృవీకరణ, వాటిపై తీసుకున్న చర్యల సమీక్ష, తాజా పరిపాలన నివేదిక ఆమోదం వంటి అంశాలను చేర్చారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… స్వల్పకాలిక ,దీర్ఘకాలిక రుణాల అందించడంలో పురోగతి ఉన్నప్పటికీ, పెండింగ్ రుణాల రికవరీపై మరింత దృష్టి పెట్టాలని సూచించారు. రైతులకు విస్తృతంగా రుణాలు అందించడమే కాకుండా, వ్యవసాయ యంత్రీకరణను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలని సూచించారు. వ్యవసాయ రుణాలు, వ్యవసాయేతర రుణాలు, రూరల్ హౌసింగ్, రైతు నేస్తం పథకాల్లో ఇచ్చిన రుణాల వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్యాంకు ఆర్థిక స్థిరత్వం కోసం ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాద బీమా పరిమితిని రూ.1 లక్ష నుండి రూ.2 లక్షలకు పెంచేందుకు పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు తెలిపారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 105 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, అందులో 83 సంఘాలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకుతో అనుబంధంగా పనిచేస్తున్నాయి. నాబార్డు సహకారంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో 38 ఏటీఎంలు , 3 మొబైల్ ఏటీఎం వాహనాలు ఏర్పాటు చేసి ఖాతాదారులకు సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ సేవలు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయని, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తున్నామని,ఆర్థికంగా బ్యాంకు గణనీయమైన పురోగతి సాధించినట్లు సమావేశంలో కార్యవర్గ సభ్యులకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ సీఈఓ సురేష్ వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్లు సుమారు 11.54 శాతం వృద్ధి సాధించగా, రుణాల పంపిణీ , లాభాల్లో కూడా పెరుగుదల నమోదైనట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాబార్డ్ జనరల్ మేనేజర్ కృష్ణ చైతన్య.
టీజీ సి ఏ బి సురేఖ, డి సి ఓ కిరణ్ కుమార్, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.