మహదేవపూర్, ముద్ర:
మండల కేంద్రంలోని ప్రాథమిక పశువైద్యశాలలో గాలికుంటు వ్యాధి నివారణ టీకాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ప్రచార రథాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజబాబు, మహదేవపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ హసీనా భాను జెండా ఊపి రథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాలికుంటు వ్యాధి పశువులకు తీవ్రమైన నష్టం కలిగించేదిగా ఉండటంతో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. టీకాలు వేయించడం ద్వారా వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని, పశువైద్యశాఖ సూచనలను రైతులు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.
ఈ ప్రచార రథం ద్వారా గ్రామాల వారీగా పశుపోషకులకు అవగాహన కల్పిస్తూ టీకాల ప్రాధాన్యతను వివరించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పశువైద్య అధికారి డాక్టర్ రాజబాబు గౌడ్, సిబ్బంది నాగభూషణం, లావణ్య తదితరులు పాల్గొన్నారు.