- శ్రావణ తొలిశుక్రవారం వేలాదిగా అమ్మవారిని దర్శించుకున్న మహిళలు
బోడుప్పల్, ముద్ర విలేకరి: బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో వేంచేసివున్న శ్రీ మాతా నిమిషాంబికా దేవి ఆలయం శ్రావణమాసం తొలి శుక్రవారం సందర్భంగా లక్ష్మీ శోభను సంతరించుకుంది. అమ్మవారిని 1,116 చీరలతో విశేషంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దేదీప్యమానంగా వెలుగు దివ్వెల కాంతులతో భక్తులకు అభయమిస్తున్నారు. మహోజ్వల కాంతులతో మెరిసిపోతున్న అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మురిసిపోతున్నారు. వేలాదిగా మహిళలు శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎవరికీ ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజాదికాలు నిర్వహిస్తున్నారు. ఆలయంలో ఆదివారం వరకు ఇదే అలంకరణలో అమ్మవారి దర్శన భాగ్యం వుంటుందని కొరిచర్ల శ్రీనివాసరావు తెలిపారు.