Take a fresh look at your lifestyle.

చర్చలతో పరిష్కరించుకుందాం, వివాదాలు వద్దు

  • కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడీ వివాదం ఉండేది కాదు.
  • కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో చర్చించాల్సింది.
  • తెలంగాణలో ప్రాజెక్టులు కట్టించి నిజాం, కాంగ్రెసే.
  • కేసీఆర్​ నిర్మించింది ఏదీ లేదు.
  • పోలవరంలో మార్పులకు తెలంగాణ అనుమతి తప్పనిసరి.
  • ఏపీలో టీడీపీ మళ్ళీ గెలవాలంటే గోదావరి నీళ్లు అవసరం.
  • నీళ్ల అంశాన్ని బీఆర్​ఎస్​ సంజీవనిలా వాడుకోవాలని చూస్తుంది.
  • కేటీఆర్‌కు కిషన్‌ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
  • కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
  • బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది.
  • ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్​ చాట్​.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కృష్ణా, గోదావరి జలాల నీటి కేటాయింపులు సహా మిగతా ఏ అంశంలోనైనా తెలంగాణ..ఏపీతో ఎలాంటి వివాదాలు కోరుకోవడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ గోదావరి నదిపై బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి ఏపీ..తెలంగాణ హక్కులను కాలరాయాలని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.ఈ ప్రాజెక్టు విషయంలో కూర్చుని మాట్లాడుకుంటే ఇప్పుడు ఈ వివాదం ఉండేది కాదన్నారు.కేంద్రానికి పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే తెలంగాణతో ఏపీ చర్చించి ఉంటే సమస్య ఉండేది కాదన్నారు.ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ..తెలంగాణను సంప్రదించకుండా నేరుగా కేంద్ర ప్రభుత్వానికి ప్రాథమిక సాధ్యసాధ్యాల నివేదిక (పీఎఫ్ఆర్) సమర్పించడమే ప్రస్తుత వివాదానికి రేవంత్ రెడ్డి అన్నారు.పీఎఫ్ఆర్ ఇచ్చే ముందే మాతో చర్చించి ఉంటే ఈ వివాదం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు.కేంద్రానికి ఏపీ నివేదిక ఇవ్వగానే,కేంద్రం కూడా అన్ని రకాల చర్యలకు సిద్ధమవుతోందని అన్నారు.ఈ అంశంపై చర్చించేందుకు తమకు ఎలాంటి బేషజాలు లేవని సీఎం స్పష్టం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని ప్రాజెక్టుల వారీగా సమస్యలపై మాట్లాడుకుందామని ఆయన సూచించారు. ఒక రోజు కాదు..అవసరమైతే నాలుగు రోజులైనా చర్చిద్దామన్నారు.రాష్ట్రాల మధ్య జలవివాదాలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని స్పష్టం చేశారు.ఈ నెల 23న కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ వ్యవహారంపై మంత్రులతో చర్చిస్తామని సీఎం తెలిపారు. ఈ భేటీలో బనకచర్ల అంశంపై సమగ్రంగా చర్చించిన తర్వాత.. ఏపీని బనకచర్లపై చర్చలకు పిలుస్తామన్నారు. కావాలంటే ఏపీ సీఎం చంద్రబాబును తానే స్వయంగా భేటీకి ఆహ్వానిస్తానని వెల్లడించారు. ఎవరి ప్రయోజనాల కోసమో తమ రాష్ట్ర హక్కులను వదిలేసుకోబోమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తెలుగువారి మధ్య అనవసరమైన సమస్యలు ఉండొద్దని సీఎం అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలోని అంశాలను పరిష్కరించుకునేందుకు ఇప్పటికే అధికారులు,మంత్రుల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం శుక్రవారం అక్కడి మీడియాతో చిట్​ చాట్ చేశారు.ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై సీఎం సీరియస్ అయ్యారు.కేటీఆర్‌కు కిషన్‌ రెడ్డి లైజనింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారని విమర్శించారు.బీఆర్ఎస్ ఆర్గాన్ డొనేషన్ చేసింది కాబట్టే..పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది ఎంపీ స్థానాలు గెలిచిందన్నారు.కిషన్‌ రెడ్డికి కేటీఆర్‌ ప్రైవేట్ ట్యూషన్ మాస్టర్‌గా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.బీఆర్ఎస్ కోసం బీజేపీ,బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని..ఇప్పుడు ఇద్దరి బంధం బలపడిందన్నారు.ఈ బంధమే మెదక్‌లో బీఆర్ఎస్‌ను ఓడించిందని చెప్పారు. అయినా బుద్ధి రావడం లేదని అన్నారు.

  • తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించింది నిజాం, కాంగ్రెసే.

తెలంగాణలో ప్రాజెక్టులు కట్టిందంటే ఒకటి నిజాం, మరొకటి కాంగ్రెస్ మాత్రమేనని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పదేండ్ల తన పాలనలో కేసీఆర్ ఒక్క ప్రాజెక్టును నిర్మించలేదని విమర్శించారు.కృష్ణా, గోదావరి జలాల విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న సీఎం..తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్‌కు ధారాదత్తం చేసిందని ఆరోపించారు. నీళ్లు, నిధుల పేరిట బీఆర్ఎస్ నేతలు మోసపూరిత సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకున్నారని చెప్పారు. రాయలసీమను రత్నాలసీమ చేస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్​యలను గుర్తు చేశారు. గదావరి జలాలను ఏపీ ఉపయోగించుకుంటే తప్పేంటని కూడా గతంలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు.కృష్ణా, గోదావరి జలాలపై తెలంగాణ హక్కులను ఏపీకి రాసిచ్చింది కేసీఆర్, హరీశ్ రావులే”అని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాను కృష్ణా జలాల్లో 500 టీఎంసీలకు బ్లాంకెట్ ఎన్ఓసీ అడిగితే మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వాదనలో పసలేదన్నారు. 2023లో కేంద్రానికి హరీశ్ రావు రాసిన లేఖలో కేవలం 405 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు అడిగారని గుర్తుచేశారు.తెలివితేటలకు పొడుగ్గా పెరగడానికి సంబంధం లేదని అంత ఎత్తు పెరిగిన హరీష్ రావులో తెలివి ఎంతుందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అతి తెలివితో అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. హరీష్ రావు, కేసీఆర్‌ల అబద్ధాలు వింటే వీళ్లను పుట్టించింది నేనేనా అని దేవుడు కూడా ఆశ్చర్యపోతాడని సీఎం సెటైర్లు వేశారు. ఇప్పుడు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మోడీకి చంద్రబాబు అవసరం ఉందన్నారు. ఏపీలో టీడీపీ మళ్ళీ గెలవాలంటే గోదావరి నీళ్లు చాలా అవసరమన్న రేవంత్ తెలంగాణలో బీఆర్ఎస్ బతకాలంటే నీళ్ల అంశాన్ని సంజీవనిలా వాడుకోవాలని చూస్తుందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్ఎస్‌ ఇంతకాలం బతికిన బీఆర్​ఎస్​ ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయంగా చచ్చిపోయిందని చెప్పారు.విభజన చట్టంలో పోలవరానికి మాత్రమే అనుమతి ఉందన్న సీఎం బనకచర్ల అనేది పోలవరానికి అనుబంధ ప్రాజెక్టు అని దీనిపై తెలంగాణ అభిప్రాయం తప్పకుండా తీసుకోవాల్సిందేనన్నారు. ఏపీ నిర్మించతలపెట్టిన పోలవరం ప్రాజెక్టులో మార్పులకు తెలంగాణ అనుమతి తప్పనిసరి అని సీఎం స్పష్టం చేశారు.గోదావరిలో 968 టీఎంసీలు వాడుకునే వెసులుబాటు తెలంగాణకు ఉంది.కానీ కేటాయించిన నీటిని వాడుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడంతోనే వివాదాలు తలెత్తుతున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.కోర్టుకు వెళ్లడం కంటే ముందుగా చర్చించుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ వివాద పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని స్పష్టం చేశారు.మరోవైపు వచ్చే నెల 6, 7 తేదీల్లో మరోసారి ఢిల్లీలో పర్యటించనున్నట్లు సీఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.