- శాంతి చర్చలు జరపాలి.
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్.
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆపరేషన్ కగార్ మారణకాండను వెంటనే ఆపివేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ప్రజలు తుపాకీ పట్టకుండా ఉండాలంటే, వారికి తమ ఆవేదనను, అభ్యంతరాలను వ్యక్తపరచగల సమర్థ వేదికలు ఉండాలని ఆయన సూచించారు.సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధ మార్గాల్లో చర్చల వాతావరణాన్ని కల్పించాలన్నారు.తుపాకీలతో కాకుండా, చర్చల ద్వారానే శాశ్వత పరిష్కారం సాధ్యం అని అన్నారు.ఈ మేరకు ఆదివారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ దాసోజు మాట్లాడారు.. శాంతి, చర్చల మార్గం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు.ఇటీవల కాలంలో వరంగల్ మహాసభలో ఆపరేషన్ కగార్‌ను ఆపివేయాలని తమ పార్టీ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారని ఆయన గుర్తు చేశారు.ప్రజాస్వామిక హక్కులు, శాంతియుత జీవనాన్ని గౌరవించే విధంగా రాజ్యాంగాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయడమే ఏకైక శాశ్వత పరిష్కార మార్గమని ఎమ్మెల్సీ శ్రవణ్ స్పష్టం చేశారు. ప్రజలు తుపాకీ పట్టడం వెనుక ఉన్న మౌలిక కారణాలపై పాలక వర్గాలు ఆత్మపరిశీలన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తుపాకీ పట్టే పరిస్థితులు అనేవి హఠాత్తుగా రావని, దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆర్థిక, సామాజిక అసమానతల ఫలితమని ఆయన వివరించారు.తుపాకీ పట్టటానికి ఎవరూ పుట్టగానే సిద్ధపడరని, కానీ ఆ మార్గాన్ని తప్పనిసరి చేయడంలో ఫ్యూడల్ అధికార రాజకీయ వ్యవస్థల పాత్ర ఉందని పేర్కొన్నారు. పెట్టుబడిదారి ఆధిపత్య వర్గాల ఆధిపత్యం, అణచివేతల పాలన, న్యాయం లేకపోవడం లాంటి దౌర్భాగ్యకర పరిస్థితులే ఈ విషాద దిశకు దారి తీస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.