ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
పదవ తరగతిలో ఫెయిలైన్ ఓ సాధారణ విద్యార్థి, కష్టపడి చదివి డాక్టరేట్ స్థాయికి ఎదగడం అరుదైన విషయం. వివరాల్లోకెళ్తే నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం అనంతవరం గ్రామానికి చెందిన డాక్టర్ ఆవుల సైదులు ఈ విజయగాథకు సజీవ సాక్ష్యంగా నిలిచారు.
వ్యవసాయ కుటుంబానికి చెందిన కీ.శే. శ్రీమతి రాములమ్మ, కీ.శే. శ్రీ రంగయ్య దంపతులకు ఎనిమిదవ సంతానంగా జన్మించిన ఆవుల సైదులు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి తెలుగులో పిహెచ్.డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు.
పదవ తరగతిలో ఫెయిలైన అనంతరం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి సమీపంలోని కామినేని వైద్య కళాశాలలో భవన నిర్మాణ కార్మికునిగా ఏడాది పాటు పనిచేశారు. అనంతరం ఉన్నత విద్యపై ఆసక్తితో నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఓరియంటల్ కళాశాలలో చేరి పి.డి.సి, బి.ఏ (ఎల్), ఎం.ఎ (తెలుగు) పూర్తి చేశారు. అదనంగా దూరవిద్య ద్వారా ఎం.ఎ సంస్కృతం కూడా పూర్తి చేశారు.
హైదరాబాద్‌లో తెలుగు పండిత శిక్షణ పూర్తి చేసిన ఆయన, 2012లో ఏపీ సెట్ మరియు 2017లో యూజీసీ నెట్ పరీక్షలను ఉత్తీర్ణులయ్యారు. దాదాపు 12 సంవత్సరాల పాటు వనపర్తి పట్టణంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో సంస్కృత అధ్యాపకులుగా సేవలందించారు.
2018లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో నాలుగవ ర్యాంకు సాధించి, వనపర్తి జిల్లా, మదనాపురం మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో టి.జి.టి తెలుగు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఎస్సీ గురుకుల పాఠశాలలో పి.జి.టి తెలుగు ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు.
ఉన్నత విద్యపై ఆసక్తితో 2018 సెప్టెంబర్‌లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో పిహెచ్.డి ప్రవేశం పొందారు. “నాగర్ కర్నూల్ జిల్లా శతక సాహిత్యం – ఒక పరిశీలన” అనే అంశంపై ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి పర్యవేక్షణలో పరిశోధనల చేసి డాక్టరేట్ పట్టా సాధించారు.
పదవ తరగతి ఫెయిలైన స్థితి నుంచి ప్రారంభించి అత్యున్నత విద్యను సాధించడం అనేక మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఈ సందర్భంగా డా. ఆవుల సైదులు తన తల్లిదండ్రులకు, చిన్నప్పటినుండి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకర శర్మ, రఘు విజయలక్ష్మి, పరిశోధన పర్యవేక్షకులు ఆచార్య కాకునూరి సూర్యనారాయణ మూర్తి అభినందించారు. అలాగే ప్రభుత్వ సిటీ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య ప్రసాద్ సన్మానించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉన్నతాధికారులు, సహచర ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు.
గ్రామస్తులు, మిత్రులు, కుటుంబ సభ్యులు ఈ విజయాన్ని ఆనందంగా స్వాగతిస్తూ, గ్రామానికి పేరు ప్రతిష్టలు తెచ్చినందుకు అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించారు. అనంతరం డాక్టర్ ఆవుల సైదులు మాట్లాడుతూ తన ఈ జ్ఞానాన్ని బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థులను సమాజంలో అత్యున్నత స్థానంలో ఉంచడానికి అందిస్తానని తెలిపారు.