సంగారెడ్డి, ముద్ర ప్రతినిధి ఫిబ్రవరి 18:
క్షేత్రస్థాయి సందర్శన శిక్షణతో అధికారులు ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా అర్థం చేసుకునేందుకు అత్యంత కీలకమని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య పేర్కొన్నారు. గ్రామస్థాయిలో పథకాల అమలు, ప్రజల జీవన విధానం, అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం వంటి అంశాలను నిశితంగా పరిశీలించి ఆకళింపు చేసుకున్నప్పుడే భవిష్యత్తులో సమర్థవంతంగా ప్రజలకు సేవలు అందించగల మన్నారు.

రెండు రోజుల శిక్షణలో భాగంగా జిల్లాలోని బడంపేట, సజ్జాపూర్, అనంతసాగర్, మల్లేపల్లి, గొంగళూరు, బస్వాపూర్, అరూర్, వెల్టూర్, అల్గోల్, మల్ చల్మా గ్రామాలను సందర్శించిన ఆరు శాఖలకు చెందిన 60 మంది గ్రూప్-వన్ ప అధికారులు తమ శిక్షణను పూర్తి చేసుకొని బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
గ్రామాల్లో నిర్వహిస్తున్న పలు శాఖల పనితీరు, పాఠశాలలు, పీహెచ్‌సీలు, అంగన్వాడీ కేంద్రాలు, అమలవుతున్న
ప్రభుత్వ పథకాలు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులను పరిశీలించిన అధికారులు గ్రామ ప్రజలు, స్వయం సహాయక సంఘాల మహిళలతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో వారితో సమావేశమైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ మరియు జిల్లా అభివృద్ధిలో అధికారుల పాత్ర కీలకమని, ప్రజలతో మమేకమై సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలని సూచించారు. పరిపాలనలో పారదర్శకత, సమర్థత, ముఖ్యమని వివరించారు.
ఈ సందర్భంగా పలువురు గ్రూప్-వన్ అధికారులు మాట్లాడుతూ, గ్రామాల్లో ఇందిరా మహిళ కార్యక్రమం సమర్థవంతంగా అమలవుతోందని, స్వయం సహాయక సంఘాల మహిళలు రుణాల ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నట్లు ప్రత్యక్షంగా గమనించామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయని, గ్రామాల అభివృద్ధి బేశుగ్గా ఉందని కితాబునిచ్చారు.ఈ పర్యటన తమకు ఎంతో ఉపయోగ
కరంగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పాండు, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.