ముద్ర, తెలంగాణ బ్యూరో:
నర్సంపేట డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ విధానాల కారణంగానే శంకర్ గౌడ్ బలయ్యారని ఆమె ఆరోపించారు.
శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన కవిత, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కుట్రలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, దీనికి వ్యతిరేకంగా కార్మికులు సమ్మె చేపట్టగా, ఆ సమ్మెను భగ్నం చేయడానికి ప్రభుత్వం కుతంత్రాలకు పాల్పడుతోందని విమర్శించారు.
ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురైన శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారని తెలిపారు. చికిత్స కోసం కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయనను పరామర్శించేందుకు తాను అర్ధరాత్రి వెళ్లగా, ఆసుపత్రిలోకి అనుమతించలేదని కవిత ఆరోపించారు. వైద్యులను బయటికి పంపించి, ఆయనకు 80 శాతం కాలిన గాయాలున్నాయని మాత్రమే సమాచారం ఇచ్చారని చెప్పారు.
తరువాత తెల్లవారుజామున శంకర్ గౌడ్ మరణించినట్లు ప్రకటించడం అనుమానాస్పదమని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని కవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
శంకర్ గౌడ్ కుటుంబానికి రూ.2 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్లైన సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ వంటి అంశాలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
ఈరోజు డిప్యూటీ సీఎం ఆర్టీసీ కార్మికులతో జరపనున్న చర్చల్లో వారి న్యాయమైన డిమాండ్లను అంగీకరించాలని కవిత కోరారు.