Take a fresh look at your lifestyle.

భక్తి పారవశ్యంగా బోనాల జాతర

ముద్ర,రాయికల్ : తెలంగాణ రాష్ట్రం బోనాలకు ప్రతీక అని మరియు ఈ పండుగకు చాలా విశిష్టత ఉన్నదని ప్రగతి విద్యాసంస్థ అధినేత బాలె శేఖర్ అన్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి ఉన్నత పాఠశాలలో ఆషాడమాసం సందర్భంగా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించినటువంటి ప్రగతి బోనాల జాతర కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు శేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి, అమ్మవారి చిత్రపటానికి పూల మాల వేసి ఉత్సవాలను రెట్టింపు ఉత్సాహంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ అత్యంత ప్రీతికరమైనదని, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో తరాల నుండి అవలంబిస్తున్న ఈ ఘనమైనటువంటి సాంప్రదాయం ఎటువంటి లోటులేకుండా కొనసాగించడం చాలా శుభపరిణామమని తెలుపుతూ,మహిళలకు అత్యంత ఆరాధ్యమైన పండుగ బోనాల పండుగ అని, బోనాలకు ఎత్తుకోవడం ద్వారా ఇండ్లల్లో ఆయురారోగ్యాలతో పాటు శుభఫలాలు సిద్ధిస్తాయని ఒక ప్రగాఢ విశ్వాసమని తెలిపారు. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించినటువంటి బోనాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. సుమారు 300 మంది విద్యార్థినిలు సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో విచ్చేసి,బోనాలను ఎత్తుకొని పండుగ వాతావరణాన్ని సృష్టించారు. ప్రత్యేకంగా పోతురాజుల వేశధారణ,శివసత్తుల విన్యాసాలు, పెద్దపులుల వేషధారణలో విచ్చేసిన చిన్నారులు చేసిన విన్యాసాలు చాలా అబ్బురపరచాయి.అనంతరం ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ బాలె జయశ్రీ శేఖర్, అకాడమిక్ డైరెక్టర్ నిఖిల్ కుమార్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.