- గోదావరి నదీ జలాలను ఏపీ తరలించుకుపోతుంది
- తుంగభద్ర నదిమీద ఏపీ, కర్ణాటక కొత్త ప్రాజెక్టులు
- ప్రభుత్వ అలసత్వమే ఈ సమస్యకు ప్రధాన కారణం
- మీడియాలో కథనాలు వస్తున్నా చలనం లేదు
- మాజీ మంత్రి హరీశ్ రావు ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో :-నీళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతున్నా…కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.ముఖ్యమంత్రి, నీటిపారుదలశాఖ మంత్రి, అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు .గోదావరి నదీ జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఒక వైపు ఏపీ యత్నిస్తుండగా….మరోవైపు తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు కట్టి పెద్దఎత్తున నీళ్లు తరలించుకపోయే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఈ అంశాలపై మీడియాలో ప్రధానంగా వార్తలు వస్తున్నప్పటికీ రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంగా ఉంటోందని మండిపడ్డారు.
శుక్రవారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ ను మూడింతలు పెంచిందన్నారు. దీంతో 200 టీఎంసీల నీటిని బంకచర్ల ద్వారా పెన్నా బేసిన్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. ఈ విషయంలోఏపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు పోతున్నా….. రేవంత్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలోసీతారామ సాగర్, సమ్మక్క సాగర్, కాళేశ్వరంలో 3వ టీఎంసీ, అంబేద్కర్ వార్ధా ప్రాజెక్టుల పనులు పెండింగులో ఉన్నాయన్నారు. ఈ నాలుగు ప్రాజెక్టులకు క్లియరెన్సులు సాధించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఏపీ ప్రభుత్వం ముందస్తూ ఎవరి అనుమతి లేకుండానే గోదావరి -బంకచర్ల ప్రాజెక్టును తీసుకొని పోతున్నదన్నారు. పైగాకొత్త ప్రాజెక్టులు కట్టుకుంటున్నాం నిధులివ్వండి అంటూ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖలు కూడా రాశారన్నారు.
ఏడీబీ నుంచి రూ. 40 వేల కోట్ల నిధులిప్పిస్తామని వాళ్లు మాట కూడా ఇచ్చారని ఈ సందర్భంగా హరీశ్ రావు గుర్తు చేశారు. పక్క రాష్ట్రం ఎంతో స్పీడ్ గా అడుగులు వేస్తుంటే..సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసి ఈ ప్రాజెక్టులను ఆపాలని అడిగే సోయి లేదా? అని ప్రశ్నించారు.ఏపీ అక్రమ ప్రాజెక్టులకు కేంద్రం ఏ రకంగా సహకరిస్తుందని అడగాలి కదా? అని నిలదీశారు. ఎన్నో త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ నీళ్ల విషయంలో నష్టపోవద్దు ని అన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇకతుంగభద్ర నీళ్లను తరలించేందుకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కాల్వలు తవ్వుకుంటున్నాయన్నారు. దీని వల్ల కల్వకుర్తి, డిండి ఎత్తిపోతలు, సాగర్ ఆయకట్టు నీళ్లందక దెబ్బతినే ప్రమాదం ఉన్నదన్నారు.
ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్నదని నిలదీశారు,2017లో ఏపీ ప్రభుత్వం గోదావరి నుంచి నీళ్లు తరలించే ప్రయత్నం చేస్తే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాజకీయాలకన్నా బీఆర్ఎస్ కు రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల హక్కులే ముఖ్యమన్నారు. అందుకే సూచనలిస్తున్నామన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తీవ్ర అసంతృప్తి…ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయం, సందర్భం వచ్చినపుడు రాజకీయాలు పక్కనపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలి…. ఇతర రాష్ట్రాలను చూసి నేర్చుకోవాలన్నారు.
Next Post