ముద్ర యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ముఖ మండపం నందు అర్చకులు వైభవంగా లక్ష పుష్పార్చనను నిర్వహించారు.ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ఉదయం పంచామృతాలతో వేద మంత్రాలతో ఆలయ అర్చకులు ఘనంగా అభిషేకం నిర్వహించారు.పట్టు వస్త్రాలను ధరింపజేశారు.వివిధ రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు.
ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేసి గులాబీ,మందారం, మల్లె,చామంతి,చంపక,మల్లికా, వంటి అనేక రకాలైన పుష్పాలతో స్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన చేస్తూ లక్ష పుష్పార్చన చేశారు.ఉదయం సుదర్శన హోమం చేశారు. ఇందులో ఆంజనేయం, నరసింహం, వంటి దేవతల మూల మంత్రాలతో హవనం చేసారు.అలాగే నిత్య కళ్యాణం ఘనంగా నిర్వహించారు. సాయంకాలం వెండి జోడు సేవ వంటి సేవలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు, ప్రధానార్చకులు నల్లంతిగల్ లక్ష్మీనరసింహచార్యులు, ఉప ప్రధానార్చకులు మంగళగిరి నరసింహమూర్తి ,అర్చకులు, సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.