– నాలుగు వారాల్లో నివేదికకు అధికారుల కమిటీ
జి.ఓ.ఎం.ఎస్. నెం.66తో TGRTC ఉద్యోగుల అంశాల పరిశీలనకు కమిటీ ఏర్పాటు
సేవా నిబంధనలు, వేతనాలు సహా అన్ని సమస్యలపై సమగ్ర అధ్యయనం
నాలుగు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న కమిటీ
సమ్మెలు లేకుండా పరిష్కారం దిశగా ప్రభుత్వం సానుకూల సంకేతాలు
రోజూ 65 లక్షల ప్రయాణికుల సేవలు అంతరాయం లేకుండా కొనసాగించడంపై దృష్టి
ముద్ర, కరీంనగర్ :
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు లేవనెత్తిన వివిధ సమస్యలను పరిశీలించేందుకు అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ జి.ఓ.ఎం.ఎస్. నెం.66ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
ఉద్యోగుల సేవా నిబంధనలు, వేతనాలు, ఇతర ప్రయోజనాలపై ప్రభుత్వం వద్దకు వచ్చిన వినతులను సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కమిటీకి రవాణా, రహదారులు & భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కార్మిక, ఉపాధి, శిక్షణ & కర్మాగారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ సభ్యుడు-కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ కమిటీ అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నాలుగు వారాల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. సమ్మెలు, ఆందోళనల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
రోజూ సుమారు 65 లక్షల మంది ప్రయాణికులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద ప్రజలు ఆర్టీసీ బస్సులపై ఆధారపడుతున్నారని ఆయన పేర్కొన్నారు. పేదలకు బస్సు ప్రయాణం జీవనాధారమని, అందువల్ల సేవలు అంతరాయం కలగకుండా చూడటం ప్రభుత్వం, ఉద్యోగుల బాధ్యత అని అన్నారు.
ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యలను అధికారుల కమిటీ ముందుకు తీసుకురావాలని, కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం చర్చలు జరిపి తగిన పరిష్కారాలు అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.
ఆర్టీసీ సంస్థ పరిరక్షణతో పాటు ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం అన్నింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఆయన తెలిపారు.