ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారు
కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే
రూ.9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు
లక్ష కోట్ల అవినీతిపై సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదు
తేజస్వీ వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి
తెలంగాణ ఉద్యమకారులను తేజస్వీ దేశభక్తులతో పోల్చారు
కేసీఆర్, రేవంత్ రెడ్డిలపై నిప్పులు చెరిగిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
కరీంనగర్ రేకుర్తిలో చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి
కరీంనగర్ లో ఇకపై గల్లీగల్లీలో రోడ్లు నిర్మిస్తామని ప్రకటించిన బండి సంజయ్
అందరి సహకారంతో కరీంనగర్ రూపురేఖలు మార్చి అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని వెల్లడి
ముద్ర, కరీంనగర్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహువు అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేతువు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అభివర్ణించారు. నువ్వు చావాలంటే నువ్వు చావాలంటూ ఒకరికొకరు పైకి తిట్టుకుంటూ ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారని మండిపడ్డారు. కాళేశ్వరంసహా కేసీఆర్ కుటుంబం చేసిన అవినితిని కప్పిపుచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని గత ఎన్నికల్లో చెప్పిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రూ.9 వేల కోట్లకే పరిమితమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ నిర్మాణాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాయడమే ఇందుకు నిదర్శనమన్నారు. కేసీఆర్ అవినీతి బయటపడాలంటే రూ.లక్ష కోట్ల కాళేశ్వరం నిర్మాణంపై విచారణ జరపాల్సి ఉందన్నారు. రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్ ను కాపాడాలనే ఉద్దేశంతోనే డిజైన్ లోపాలతో నిర్మించిన మేడగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ కోరుతున్నారని చెప్పారు. రేవంత్ కు దమ్ముంటే లక్ష కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతిపై విచారణ కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని సవాల్ విసిరారు.
ఈరోజు కరీంనగర్ లోని రేకుర్తి చెరువు సుందరీకరణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కార్పొరేటర్లు గుగ్గిళ్ల రమేశ్, బోయినిపల్లి ప్రవీణ్ రావు, బండ రమణారెడ్డి తదితరులతో మీడియాతో రేవంత్ రెడ్డి, కేసీఆర్ లపై నిప్పులు చెరిగారు. ఏమన్నారంటే…
కరీంనగర్ కార్పొరేషన్ అభివ్రుద్ధిలో భాగంగా అమ్రుత్ 2 పథకంలో భాగంగా 3 చెరువుల పునరుజ్జీవం కోసం 5 కోట్ల 82 లక్షల రూపాయల నిధులను కేంద్రం మంజూరు చేసింది. అందులో భాగంగా 1 కోటి 98 లక్షల రూపాయలతో ఈరోజు రేకుర్తి చెరువు పునరుజ్జీవ పనులకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉంది. డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా చర్యలు తీసుకోవడంతోపాటు రేకుర్తి చెరువును అందంగా తీర్చిదిద్ది కరీంనగర్ ప్రజలు కుటుంబాలతో కలిసి వచ్చి సేద తీరేలా మినీ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. దీంతోపాటు కరీంనగర్ గల్లీలోని రోడ్లను నిర్మించాలని నిర్ణయించాం. రాజకీయాలకు అతీతంగా కరీంనగర్ లో గుంతలు పడ్డ అన్ని గల్లీల్లో రోడ్లను నిర్మిస్తాం.
ప్రజల ద్రుష్టిని మళ్లించేందుకు కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. నువ్వు చావాలని ఒకరు, నేను చావాలని కోరుకుంటావా? అని ఇంకొకరు చావుల గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి తెలంగాణకు పట్టిన శని కేసీఆర్, రేవంత్ రెడ్డి. వీళ్లిద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను సంపుకుతింటున్నారు.
నిజం చెప్పాలంటే కేసీఆర్, రేవంత్ రెడ్డి రాహు కేతువులు. పురాణంలో అమ్రుత మథనం సమయంలో స్వర్పణుడు అనే రాక్షసుడు దేవత వేషం వేసుకుని అమ్రుతం దొంగిలించాలని చూస్తే విష్ణువు వచ్చి అతని తల నరికేస్తారు. ఆ తల కేసీఆర్, మొండెం రేవంత్ రెడ్డి. ఇద్దరూ కలిసి డ్రామాలు చేస్తూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు.
కాళేశ్వరం విషయంలో లక్ష కోట్ల రూపాయల స్కాం జరిగిందని గత ఎన్నికల్లో పదేపదే చెప్పిన రేవంత్ రెడ్డి … సీఎం అయ్యాక అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీ అక్రమాలపైనే విచారణ జరపాలని సీబీఐకి లేఖ రాశారు. నిజానికి వాటి విలువ రూ.9 వేల కోట్లు మాత్రమే. డిజైన్ లోపాలవల్లే ఆయా బ్యారేజీలు డ్యామేజీ అయ్యాయని అందరికీ తెలుసు. అయినా లక్ష కోట్ల ధనం వ్రుధాపైనా, అవినీతిపైన సీబీఐ విచారణ జరపాలని ఎందుకు కోరడం లేదు? కేసీఆర్ కుటుంబాన్ని కాపాడటానికే రేవంత్ రెడ్డి చాలా తెలివిగా 9 వేల కోట్లపైనే విచారణ జరపాలని సీబీఐ లేఖ రాస్తున్నారు. మోటార్ల కొనుగోలులోనే పెద్ద అవినీతి చేశారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాళేశ్వరం విషయంలో వీళ్లు ఆడుతున్న డ్రామాలపై తెలంగాణ ప్రజలకు త్వరలోనే లేఖ రాస్తాం.
జీవన్ రెడ్డి విషయంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద విధానాలను పాటిస్తోంది. జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ఇష్టం లేక అలిగి ఢిల్లీ పోయారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. వాళ్లే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు కోసం పోయారని అంటున్నారు. అన్నీ అబద్దాలే. బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తే ఉండదు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్ దే. భవిష్యత్తులో జరిగేది కూడా అదే. బీజేపీ ఎన్నడూ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు. ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికలొస్తే బీజేపీ గెలుస్తది. తన సీటు ఖాళీ అవుతుందనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏకంగా రాహుల్ గాంధీ సీటుకు ఎసరు పెట్టారు.
తెలంగాణలో బీజేపీ గెలిచే అవకాశాల్లేవని జీవన్ రెడ్డి అన్నంత మాత్రాన నిజం కాబోదు. ఆ మాటకొస్తే నిజామాబాద్ లో ఎవరు గెలిచారు. తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలుచుకుంది.
తేజస్వీ సూర్య వ్యాఖ్యలను కాంగ్రెస్, బీఆర్ఎస్ వక్రీకరించాయి. తెలంగాణ ఉద్యమకారులను దేశ భక్తులతో పోల్చారని తేజస్వీ నాతో చెప్పారు. దేశ విభజన సమయంలో కాంగ్రెస్, బ్రిటీషర్ల విధానాల వల్ల లక్షలాది మంది చనిపోయారు. తెలంగాణ విషయంలోనూ కాంగ్రెస్ చేసిన తప్పిదాల వల్ల 1400 మంది బలిదానమయ్యారని తేజస్వీ చెప్పారు. ఈ విషయాన్ని వక్రీకరించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. నిజానికి పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలే తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తే… అడ్డుకుని తెలంగాణ బిల్లును ఆమోదించి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ ఎంపీలే కదా. ఆనాడు సోనియాగాంధీని బలిదేవత అని రేవంత్ రెడ్డే చెప్పారు కదా. అట్లాంటి వ్యక్తి కేబినెట్ లో మంత్రులుగా ఉన్న వాళ్లు బీజేపీని విమర్శించడం హాస్యాస్పదం.