Take a fresh look at your lifestyle.

భూ సమస్యలపై దృష్టి

  • దరఖాస్తులపై వెంటనే స్పందించి.. పరిష్కరించాలి.
  • కలెక్టర్లకు మంత్రి పొంగులేటి సూచన.

ముద్ర, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్​ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ భార‌తి చ‌ట్టంతో భూ స‌మ‌స్యల‌న్నింటికీ ప‌రిష్కారం చూపాల‌ని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి జిల్లాల కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం బాధ్యత సంబంధిత జిల్లాల కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. గ‌త ప్రభుత్వంలో భూముల‌కు సంబంధించి రైతులు అనుభ‌వించిన కష్టాల‌కు, బాధ‌ల‌కు విముక్తి క‌ల్పించేలా భూ భార‌తి రెవెన్యూ స‌ద‌స్సుల్లో వ‌స్తున్న ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల‌ని సూచించారు.కొత్తగా నియ‌మితులైన‌ సంగారెడ్డి క‌లెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట క‌లెక్టర్‌ హైమావ‌తి, హైద‌రాబాద్ క‌లెక్టర్ హ‌రిచంద‌న‌, నిజామాబాద్ క‌లెక్టర్ విన‌య‌కృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్ స్పెష‌ల్ సెక్రట‌రీ రాజీవ్‌గాంధీ హ‌నుమంత్ మంగళవారం స‌చివాల‌యంలో మంత్రిని మ‌ర్యాద‌ పూర్వకంగా క‌లిశారు. ఈ సందర్భంగా మంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వచ్చే రెండు నెల‌లు రెవెన్యూశాఖ‌కు అత్యంత కీల‌కం అన్నారు. భూ స‌మ‌స్యల ప‌రిష్కారానికి గడువుగా నిర్ణయించిన ఆగ‌స్టు 15 నాటికి న్యాయ‌బ‌ద్దమైన అన్ని ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్కరించాల‌ని సూచించారు. రాష్ట్రంలో ప్రజాపాల‌న మొద‌లై ఏడాదిన్నర అవుతుంద‌న్న ఆయన ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో భూ స‌మ‌స్యల‌ను ప‌రిష్కరిస్తూ సంక్షేమం అభివృద్ది ప‌ధ‌కాల‌ను ప్రజ‌ల‌కు చేర‌వేస్తున్నామ‌న్నారు. ప్రభుత్వం రూపొందించిన ప‌ధ‌కాల‌ను అమ‌లు చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించ‌వ‌ల‌సిన బృహ‌త్తర బాధ్యత క‌లెక్టర్లదేన‌ని అన్నారు. ప్రజ‌ల ఆకాంక్షల‌కు అనుగుణంగా ప్రభుత్వం ప‌ని చేస్తుంద‌ని ప్రభుత్వ ఆలోచ‌న‌కు అనుగుణంగా క‌లెక్టర్లు ప‌ని చేయాల‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.