బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో దుర్గాష్టమి అత్యంత ముఖ్యమైన రోజు. ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజు శ్రీ మాతా నిమిషాంబికా దేవి అమ్మవారు ఆదిపరాశక్తి అమ్మ శ్రీ దుర్గాదేవి విశేష అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు. పంచప్రకృతి మహాస్వరూపాల్లో ఒకటైన దుర్గా రూపంలో నిమిషాంబిక అమ్మవారు భక్తులకు ఆశీర్వదిస్తున్నారు. అమ్మను పూజిస్తే శక్తి, ధైర్యాన్ని ప్రదానం చేసి కష్టాలు తొలగిస్తుందని, శత్రుబాధలు తొలుగుతాయనీ, సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందనీ భక్తుల నమ్మకం. అమ్మ దయ ఉంటే అన్నీఉన్నట్లే.
దసరా పండుగ సందర్భంగా బోడుప్పల్ కార్పొరేషన్ 28వ డివిజన్ లో పనిచేస్తున్న 12 మంది పారిశుద్ధ్య కార్మికులకు బోడుప్పల్ మున్సిపల్ కమిషనర్ శ్రీమతి శైలజ, మాజీ కార్పొరేటర్ చీరాల నరసింహ ధ్వారా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. నిమిషాంబికా ఆలయానికి విచ్చేసిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు.