Take a fresh look at your lifestyle.

మహిషాసుర మర్దినిగా నిమిషాంబికా అమ్మవారు

బోడుప్పల్, ముద్ర ప్రతినిధి: శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో  భాగంగా పదో రోజు శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజోపుంజమై, సర్వదేవత స్వరూపిణిగా శ్రీ మహిషాసురమర్ధిని దేవిగా భక్తులకు దర్శనం కల్పించారు. బుధవారం ఉదయం నుంచే వేలాదిగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దేవి తన భక్తులను దుష్టశక్తుల నుంచి రక్షించి, లోకానికి శాంతిని ప్రసాదిస్తుంది. దేవతలందరి శక్తులను స్వీకరించి, అసురుడైన మహిషుడిని సంహరించి, దుష్టత్వాన్ని అంతం చేసి, భూమిని రక్షించిన శక్తి స్వరూపిణిగా మహిషాసుర మర్దినిని కొలుస్తారు.  సర్వమంగళ దాయనిగా సకల ప్రాణి కోటికి సహజ ధర్మాలు వర్తిస్తాయని తెలియజేస్తూ, ఎప్పటికైనా చెడుపై మంచి జరిగి శుభాలను అందిస్తుందని, అఖిలాండకోటికి విజయాలను అందిస్తూ దివ్య కాంతులతో దర్శన భాగ్యం కల్పించారు.

సరిహద్దులో సైనికులకు రక్షగా సింధూర్ సామూహిక కుంకుమార్చన

భారత దేశ, భద్రత, రక్షణ, క్షేమము, రాబోయే రోజుల్లో ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షించమని, మన సైనికుల యొక్క ఆయురారోగ్యములు శక్తి సామర్థ్యములు కలగాలనే సంకల్పంతో మహిళామణులచే సింధూర్  సాముహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. వందలాదిగా మహిళలు ఈ అర్చనలో పాల్గొని దేశభద్రత, రక్షణను కాంక్షిస్తూ, మన సైనిక పాటవం మరింతగా శక్తిమంతం కావాలని ఆకాంక్షించారు. హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠం ఆధీనంలోని ఈ నిమిషాంబిక ఆలయానికి విచ్చేసే భక్తులకు ఆలయ ధర్మకర్తల కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది.  భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలుగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కామరౌతు వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు  కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు పర్యవేక్షణచేశారు. నిమిషాంబిక ఆలయ ట్రస్ట్ ధర్మకర్తలు ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా (శ్యామ్), డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్. శ్రీకాంత్, ఎన్. రామకృష్ణ, బి. హిమచందర్, వై. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు చంద్రశేఖర శర్మ, అర్చకుడు ఉమాకాంత శర్మతో పాటు, ఇతర అర్చకస్వాములు భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కలిగించడంతో పాటు, గోత్రనామాదులతో పూజాదికాలు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.