Take a fresh look at your lifestyle.

ఉపాధి హామీ పథకంలో లొసుగులు సవరించాలి : సిపిఐ నారాయణ హాట్ కామెంట్

 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో ఉన్న లొసుగులను వెంటనే సవరించాలని సిపిఐ సీనియర్ నేత నారాయణ తీవ్రంగా డిమాండ్ చేశారు. గ్రామీణ పేదలకు ఉపాధి, జీవన భద్రత కల్పించేందుకు ప్రారంభించిన ఈ పథకం ప్రస్తుతం అనేక సమస్యలతో కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మహాత్మా గాంధీ పేరును తొలగించి వేరే పేరుతో ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ పథకం ప్రారంభ దశలో కూలీలకు పని చేసేందుకు అవసరమైన పనిముట్లు ప్రభుత్వం అందించేదని, కానీ ప్రస్తుతం ప్రతి కూలీ కూడా తమ పనిముట్లు తామే తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొనడం దారుణమన్నారు.

పొద్దున ఒకసారి, మధ్యాహ్నం మరోసారి ఐరస్ పేరిట ఫోటోలు తీయించడం వల్ల సమయం వృథా అవుతోందని, ఇది కూలీలకు సౌకర్యం కాకుండా వేధింపుగా మారిందని విమర్శించారు. పని చేసే సమయాన్ని తగ్గించి ఇలాంటి విధానాలతో కూలీలను ఇబ్బందులకు గురిచేయడం తగదన్నారు.

ఎండాకాలంలో గ్రామీణ ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేదతీరేందుకు పనిస్థలాల్లో షామియానాలు ఏర్పాటు చేయాలని, డీహైడ్రేషన్ కాకుండా ఉండేందుకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా ఓఆర్ఎస్ అందకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.

ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తే వారికి కేవలం 50 రోజుల పనిదినాలకే పరిమితం చేయడం సరికాదన్నారు. వేర్వేరు జాబ్ కార్డులు ఉన్న భార్యాభర్తలకు ఒక్కొక్కరికి 120 రోజుల ఉపాధి కల్పించాలని, పనిదినాలను తగ్గించడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నాయని తెలిపారు.

గుంతలు తవ్వే సమయంలో పాములు, తేళ్లు, నండ్రకాయలు వంటి ప్రమాదాలు ఎదురవుతున్నాయని, అలాంటి సందర్భాల్లో కూలీలకు తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రథమ చికిత్స పరికరాలు, మందులు అందుబాటులో ఉంచాలని కోరారు.

ప్రమాదవశాత్తు ఉపాధి హామీ కూలీలకు ఏదైనా జరిగితే వారి కుటుంబాన్ని ఆదుకునేలా ప్రమాద బీమా పథకాన్ని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు వారానికి ఒకసారి తప్పకుండా కూలి చెల్లించాలని, వేతనాల ఆలస్యం వల్ల పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

బడ్జెట్‌లో ఉపాధి హామీ పథకానికి కోతలు విధించడం సరికాదని నారాయణ మండిపడ్డారు. సంపన్నులకు దాదాపు రూ.29 లక్షల కోట్లు రైటాఫ్ చేసి, ఎండనక వాననక కష్టపడుతున్న పేద కూలీల బడ్జెట్‌లో కోతలు పెట్టడం అన్యాయమన్నారు.

గ్రామీణ పేదల సంక్షేమం కోసం ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి, కార్మికులకు పూర్తి రక్షణ కల్పించేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.