Take a fresh look at your lifestyle.

వనపర్తి మున్సిపాలిటీలో రు.45.11 కోట్ల వార్షిక బడ్జెట్ కు ఆమోదం: కలెక్టర్ ఆదర్శ్ సురభి

ముద్ర ప్రతినిధి, వనపర్తి :2025-26 ఆర్థిక సంవత్సరంలో వనపర్తి మున్సిపాలిటీలో రూ.45.11 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు వేసిన అంచనా బడ్జెట్ ను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆమోదించారు.ఇందులో మున్సిపాలిటీలో వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు 15 వ.ఫైనాన్స్,స్టేట్ ఫైనాన్స్ నిధులు ఉన్నాయి.మంగళవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలక్టర్ అధ్యక్షతన 2024-25 సవరించిన బడ్జెట్, ఇప్పటి వరకు అయిన ఖర్చులు, 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనా బడ్జెట్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ అకౌంటెంట్ కృష్ణయ్య బడ్జెట్ వివరాలను చదివి వినిపించారు.2024-25 ఆర్థిక సంవత్సరంలో 26.36 కోట్ల అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించగా 2025 సవరించిన బడ్జెట్ విలువ రూ.39.28 కోట్ల ఆదాయంగా పద్దులో చూపించారు.ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 11.67 కోట్లు వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు చేసినట్లు తెలిపారు.2025-26 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.45.11 కోట్ల ఆదాయం వివిధ మార్గాల ద్వారా సమకురనున్నట్లు అంచనా వేశారు. ఇందులో 10 శాతం నిధులు మొక్కలు నాటడం,వాటి సంరక్షణకు గ్రీన్ బడ్జెట్ గా కేటాయించినట్లు చూపించారు.

1/3 వంతు బడ్జెట్ ను పురపాలక సంఘంలోని విలీనమైన ప్రాంతాలు,అభివృద్ధి చెందని ప్రాంతాలు, మైనారిటీ,బలహీన వర్గాలు నివసించే ప్రాంతాలు,మురికి వాడల అభివృద్ధికి వాడనున్నట్లు పేర్కొన్నారు.పురపాలికలోని 33 వార్డుల అభివృద్ధి కొరకు దాదాపు 22.26 కోట్లు కేటాయించారు.అంటే ఒక్కో వార్డుకు దాదాపు 60 లక్షల వరకు ఖర్చు చేయనున్నారు.వీధి కుక్కల నియంత్రణ ఏ.బి.సి చేసేందుకు రూ.15 లక్షలు కొత్త బడ్జెట్ లో కేటాయించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిధులు సమకూర్చుకుంటేనే అభివృద్ధి సాధించవచ్చని సూచించారు.అన్ని పురపాలికల్లో ప్రాపర్టీ ట్యాక్స్ వంద శాతం వసూలు చేసేందుకు కృషి చేయాలని,అదేవిధంగా కుళాయి బిల్లులు,ఎల్.ఆర్.ఎస్ చేయించడం పై పూర్తి దృష్టి పెట్టాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీ యాదయ్య వనపర్తి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు మున్సిపాలిటిల కమిషనర్లు సైతం పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.