కలెక్టరేట్ లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
పాల్గొన్న ఎమ్మెల్యే సునీత రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్:
మహిళలకు ఆర్థిక అంశాలపై పట్టు సాదిస్తే సమాజం బాగుపడుతుందని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్లో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు.

నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్, నర్సాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ.. సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో ముఖ్యం, మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా ఎదగాలని, ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

పోరాటాలతో హక్కులు: ఎమ్మెల్యే సునీత రెడ్డి
మహిళకు, పురుషులకు గతంలో చాలా వ్యత్యాసాలు ఉండేవి, ఓటు హక్కు కూడా లేదని, వీటిపై పోరాటం చేయడం వల్ల మహిళలకు హక్కులు కల్పించబడ్డాయని నర్సాపూర్ ఎమ్మెల్యే వి. సునీత రెడ్డి అన్నారు. గతంలో మహిళా కమిషనర్ గా ఉండి పురుషులకు మహిళల హక్కుపై అవగాహన కల్పించినట్లు గుర్తు చేశారు.

మహిళలు బలహీనులు కాదు, బలవంతులన్నారు. మహిళలు అవకాశాలను అందింపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళలకు నమ్మకం, ఆత్మవిశ్వాసం ముఖ్యమన్నారు. మహిళలు మహిళాచట్టాలపై అవగాహన ఉండాలన్నారు.
అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ.. మహిళల సాధికారత కోసం సమాజం మొత్తం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. మహిళలు అన్ని రంగాలలో ముందుకు వచ్చి సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు. అనంతరం మహిళలకు శాలువ, మెమెంటోతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ కానుగు రాధిక, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మాచునూరి లక్ష్మి,
డిడబ్ల్యుఓ హేమ భార్గవి, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు మాధవి, విజయలక్ష్మి, నీలిమ,
అల్లాదుర్గ్ సీఐ రేణుక రెడ్డి, ఏఎస్ఐ రుక్సానా, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు దొంతి నరేందర్, కార్యదర్శి రాజ్ కుమార్, మహిళా ప్రజా ప్రతినిధులు, మహిళ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.