Take a fresh look at your lifestyle.

ఫార్మా సిటీ రద్దుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలి

  • సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
  • ఫోర్త్ సిటీ పేరుతో బలవంతపు భూసేకరణ ఆపాలి
  • మేడిపల్లిలో సీపీఎం నేతల పర్యటన

ముద్ర, ఇబ్రహీంపట్నం : ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ రద్దు పై స్పష్టమైన ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామంలో మంగళవారం పర్యటించిన సీపీఎం బృందం ఫార్మా భూ బాధిత రైతులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో రైతుల వద్ద నుండి బలవంతంగా భూసేకరణ చేసి అన్యాయం చేసిందని అన్నారు.ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటామని హామీ ఇచ్చి గత ప్రభుత్వ బాటలో వెళ్తోందని మండిపడ్డారు.బలవంతంగా సేకరించిన భూములను తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోర్టులో ఫార్మాకు అనుకూలంగా ఉన్నామని చెప్పినా సర్కార్,ఫోర్త్ సిటీ పేరుతో తిరిగి రైతులను మోసం చేయాలని చూస్తోందని ద్వజమెత్తారు.2200 ఎకరాల పట్టా భూమిని టీఎస్ఐఐసీ పేరు తొలగించి రైతుల పేర్లను ఆన్‌లైన్ రికార్డులో నమోదు చేయాలని డిమాండ్ చేశారు.రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రాజీనామా చేయాలన్నారు.యాచారం నుంచి అసెంబ్లీ వరకు రైతులతో కలిసి పాదయాత్ర చేసి ఫార్మాసిటీ అంశంపై ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకుంటామని,ముఖ్యమంత్రి నివాసాన్ని సైతం ముట్టడికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కిందని ఆరోపించారు.ఇందిరమ్మ ఇండ్లు,రేషన్ కార్డులు,ఆత్మీయ భరోసా,గ్యాస్ సబ్సిడీ,గృహ జ్యోతి పథకం అర్హులందరికీ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజలు, రైతుల పక్షాన సీపీఎం ఎప్పటికీ పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్ రెడ్డి,పార్టీ మండల కార్యదర్శి ఆలంపల్లి నరసింహ,సీపీఎం నాయకులు అంజయ్య, బ్రహ్మయ్య,పెద్దయ్య, జగన్,నాలుగు గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.