ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసే రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు CMR ప్యాడి పెండింగ్ కేసులపై ఎస్పీ సమీక్ష
ముద్ర, వనపర్తి:
రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వం రైసు మిల్లులకు అప్పగించిన తరువాత దానిపై ఏ విధమైన అక్రమాలు, నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిన తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ శ్రీమతి సునిత రెడ్డి అన్నారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో జిల్లా పరిధిలోని CMR (Custom Milling Rice) ప్యాడి పెండింగ్ కేసులపై పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
పెండింగ్‌లో ఉన్న CMR పడ్డీ కేసులను వేగవంతంగా విచారించి త్వరితగతిన పూర్తిచేయాలని సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ విధానాలను ఉల్లంఘిస్తూ రైతుల ధాన్యాన్ని దుర్వినియోగం చేసే రైస్ మిల్లులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత పోలీసు అధికారులకు ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారిచేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దుర్వినియోగం చేయడం, నిల్వలు దాచిపెట్టడం లేదా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని ఇవ్వకుండా ఆలస్యం చేయడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని రైతులు కష్టపడి పండించిన ధాన్యం ప్రభుత్వానికి అప్పగించబడిన తర్వాత దానిని దుర్విని యోగం చేయడం లేదా నిల్వలు దాచిపెట్టడం వంటి చర్యలు చాలా తీవ్రమైన నేరాలు. ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేసే రైస్ మిల్లర్లపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి వెనుకంజ ఉండదు. నిబంధనలు ఉల్లంఘించే వారికపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు. ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ సమయానికి బియ్యం అప్పగించడం రైస్ మిల్లుల బాధ్యత. నిబంధనలు ఉల్లంఘిస్తూ రైతుల ధాన్యాన్ని దుర్వినియోగం చేసే వారికి చట్టం ముందు తప్పించుకునే అవకాశం ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో వనపర్తి డిఎస్పీ, వెంకటేశ్వరరావు, డిసిఆర్బీ డిఎస్పీ, బాలాజీ, వనపర్తి సీఐ, రత్నం, కొత్తకోట సీఐ, రాంబాబు, జిల్లాలోని ఎస్సైలు తదితరులు ఉన్నారు.