ముద్ర ప్రతినిధి, వనపర్తి: మార్చి 31 వరకు కచ్చా లే అవుట్ లు, ప్లాట్లను క్రమబద్ధీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు .
ఎల్.ఆర్.ఎస్ పై అవగాహన కల్పించేందుకు మంగళవారం వనపర్తి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానర్ లు,లే అవుట్ రైటర్ లు,బిల్డర్లతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. 2020 తర్వాత కచ్చా లేఔట్ చేసిన వారు,వాటిలో ప్లాట్ లు తీసుకున్న వారు జిల్లాలో 29 వేల మంది ఎల్.ఆర్.ఎస్ కొరకు దరఖాస్తు చేసుకున్నారని,కానీ ఇప్పుడు క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కేవలం 38 మంది మాత్రమే ముందుకు వచ్చి డబ్బులు చెల్లించడం జరిగిందన్నారు.ఇప్పటికే జిల్లాలోని అయిదు మున్సిపాలిటీల ద్వారా దాదాపు 25 వేల మందికి నోటీస్ లు జారీ చేసినప్పటికీ ఫోన్ నెంబర్లలో తేడాలు,చిరునామాల్లో తేడాలు ఉండటం వల్ల అవి ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి చేరడం లేదన్నారు. లే అవుట్ లు చేసిన వారు,ఓనర్లు, రైటర్ లు,బిల్డర్లు ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి సమాచారం,అవగాహన కల్పించి సకాలంలో ఎల్.ఆర్.ఎస్.చేయించుకునే విధంగా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.ప్రజలకు అవగాహన లేకపోవడం లేదా సమాచారం లేకపోవడం వల్ల సద్వినియోగం చేసుకోకుంటే రేపటినాడు ఎప్పుడైనా ఎల్.ఆర్.ఎస్ ఆమోదం లేని ప్లాటు పై ఇల్లు కట్టుకోవాలంటే అప్పటి ప్లాట్ వాల్యూ పై ప్రో రేటా ఫీజు తో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.నిషేధిత స్థలం లేదా చెరువు,కుంట కింద లేకుంటే ప్లారు యజమాని ఫోన్ కు నేరుగా ఎంతడబ్బులు కట్టాలో సమాచారం వెళుతుందన్నారు.ఏదేని కారణం చేత ఎల్.ఆర్.ఎస్. తిరస్కరణకు గురి అయితే చెక్కించిన డబ్బుల నుంచి 10 శాతం ప్రాసెసింగ్ ఫీజు కింద మినహాయించుకొని మిగిలిన 90 శాతం డబ్బులు తిరిగి ప్లాటు యజమాని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని వివరించారు.ఎల్.ఆర్.ఎస్ ఉంటే ప్లాటుకు రక్షణ ఉంటుందని,ఎవరు అక్రమించుకోడానికి అవకాశం ఉండదని అదేవిధంగా లే అవుట్ ప్లాట్ల ప్రాంతాన్ని మున్సిపాలిటీ ద్వారా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందన్నారు. భవిష్యత్తులో ప్లాటు అమ్ముకోవాలనుకున్న ఎల్.ఆర్ ఎస్ ఉన్న ప్లాటు కు మంచి డిమాండు ఉంటుందని తెలియజేశారు.మున్సిపల్ కమిషనర్లు, బిల్డర్లు,లే అవుట్ ప్లానర్ లు ప్లాటు యజమానులతో సంప్రదించి ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవిధంగా చూడాలని కోరారు.అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య,మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, సబ్ రిజిస్ట్రార్,మున్సిపల్ కమిషనర్లు బిల్డర్లు లేఔట్ ప్లానర్లు టౌన్ ప్లానింగ్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.
Prev Post