Take a fresh look at your lifestyle.

భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత గురువులదే అదనపు కలెక్టర్ నగేష్ వెల్లడి

ముద్ర ప్రతినిధి, మెదక్:
చక్కటి విద్యా బుద్ధులు నేర్పించి భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే గురుతర బాధ్యతను ఉపాధ్యాయులు సమర్ధవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యా వారోత్సవాల ముగింపును ఆదివారం
మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నిర్వహించగా అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదనపు కలెక్టర్ మాట్లాడుతూ… ప్రతి ఒక్కరి జీవితంలో విద్యార్ధి దశ ఎంతో కీలకమని అన్నారు. స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, కలలను సాకారం చేసుకునే దిశగా నిజాయితీతో ముందుకు వెళ్లాలని మార్గనిర్దేశం చేశారు. భవిష్యత్తులో స్థిరపడేందుకు పదవ తరగతి తరువాత ఎంచుకునే మార్గం ఎంతో కీలకం అయినందున, మీకు ఇష్టమైన సబ్జెక్టులతో కూడిన కోర్సులలో చేరాలని, ఈ విషయంలో ఎవరు ఏం అనుకుంటారో అనే సంశయాలు, మొహమాటానికి లోను కాకూడదని విద్యార్థులకు సూచించారు. ఎంచుకున్న గమ్యాన్ని ఎలా చేరుకోవాలి అనే దానిపై స్పష్టత కలిగి ఉండాలని, ఆ దిశగా అంకిత భావంతో కృషి చేస్తే తప్పకుండా లక్ష్యాన్ని చేరుకోగల్గుతారని అన్నారు. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా నిరంతర కృషి, పట్టుదలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడకుండా పుస్తక పఠనంను అభిరుచిగా మల్చుకోవాలని, ఇది పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు.
జిల్లాస్థాయిలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ మరియు క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ప్రతి విద్యార్థికి పదివేల చొప్పున నగదు బహుపది ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, ఏఎంఓ సుదర్శన్ మూర్తి, సీఎంఓ రాజు, ఏఎస్ఓ నవీన్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.