ఓట్ల లెక్కింపుకు పకడ్బందీగా ఏర్పాట్లు
ముద్ర, వనపర్తి :
వనపర్తి జిల్లాలోని 5 మున్సిపాలిటీలకు శుక్రవారం ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. గురువారం జిల్లా ఎన్నికల అథారిటీ వనపర్తి, అమర్చింత, ఆత్మకూరు, కొత్తకోట, పెబ్బేర్ మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీకి అదే మున్సిపాలిటీ పరిధిలో లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. వనపర్తి మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు వనపర్తి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నర్సింగాయ పల్లిలో, పెబ్బేరు మున్సిపాలిటీ ఓట్ల లెక్కింపు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాల జాతీయ రహదారి పక్కన పెబ్బేరు. కొత్తకోట ఓట్ల లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాల
కొత్తకోటలో, ఆత్మకూరు ఓట్ల లెక్కింపు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆత్మకూరులో,
అమర్చింత ఓట్ల లెక్కింపు జిల్లా పరిషత్ హైస్కూల్ అమర్చింత లో లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ లెక్కింపు ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగిందని, మూడు అంచెల పోలీస్ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయి మధ్యాహ్నం వరకు అన్ని ఫలితాలు పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లెక్కింపు కేంద్రాల్లో ఫోన్ తీసుకురావడానికి అనుమతి లేదని, గుర్తింపు కార్డు లేని వ్యక్తులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేదని తెలియజేశారు.
ఎన్నికల అభ్యర్థితో పాటు ఒక ఏజెంట్ ను మాత్రమే లెక్కింపు కేంద్రంలోనికి అనుమతించనున్నట్లు తెలిపారు.
అభ్యర్థులు, అధికారులు, సిబ్బంది అందరూ సహకరించించి కౌంటింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఆర్డీఓ సుబ్రమణ్యం , డీఎస్పీ వెంకటేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఇతర సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు.