రైల్వే ఓవర్ బ్రిడ్జి, అండర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను చేపట్టాలి -చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి :
చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెండింగ్ లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, రైల్వే అండర్ బ్రిడ్జిల పనులు సత్వరమే చేపట్టాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి రైల్వే శాఖ సహాయ మంత్రి సోమన్నను కోరారు. గురువారం న్యూఢిల్లీలోని రైలు భవన్ లో రైల్వే మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సోమన్నతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గత సంవత్సరం శంకర్ పల్లి ప్రాంతానికి విచ్చేసిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కి కూడా ఈ మేరకు వినతిపత్రం అందజేసినట్టు వివరించారు. అదేవిధంగా బషీరాబాద్ మండలం నవాంద్గి రైల్వేస్టేషన్ లో హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలు నిలపడానికి దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సానుకూల ప్రతిపాదన పంపడం జరిగిందని, దానికి అనుగుణంగా రైల్వే బోర్డు ద్వారా తక్షణం హుబ్లీ ఎక్స్ ప్రెస్ రైలును ఆపడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ పట్టణంలోని జిల్లా కోర్టు దగ్గర, ఇంద్రానగర్ ప్రాంతాలలో ఉన్న రైల్వే లెవెల్ క్రాసింగ్ ల వద్ద డిపిఆర్ లు పూర్తయిన దృష్ట్యా ఆర్ఓబి, ఆర్ యుబిల నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కొండకల్, ముబారక్ పూర్, మర్పల్లి, పాత శంకర్పల్లి, మొరంగపల్లి, గేట్ వనంపల్లి, గొల్లగూడ, నావంద్గి, సిద్ధాంతి, శాతం రాయి, ఫతేపూర్ (ఎల్.హెచ్.ఎస్) ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరగా రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారని ఓ ప్రకటనలో తెలిపారు.