ముద్ర ప్రతినిధి, నిర్మల్:
మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పటిష్ట ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించనున్న సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చారు. సమయపాలన అత్యంత ముఖ్యమని, సిబ్బంది నిర్ణీత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు హాజరుకావాలని ఆదేశించారు. అన్ని నియమాలను తు చ తప్పకుండా పాటిస్తూ, పారదర్శకంగా వేగవంతంగా కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు వీరారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోలింగ్ విజయవంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. అదే క్రమశిక్షణతో ఓట్ల లెక్కింపును కూడా పూర్తి చేయాలని పేర్కొన్నారు. సిబ్బందికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అనంతరం కౌంటింగ్ హాలుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.ఆమె వెంట అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.