- బనకచర్లపై అభ్యంతరాలు తెలుపుతూ నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశాం
- బీఆర్ఎస్ హయాంలోనే నదీజలాల విషయంలో నష్టం జరిగింది
- బీఆర్ఎస్ హయాంలో జరిగిన నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
ముద్ర, తెలంగాణ బ్యూరో : గోదావరినదిపై ఏపీ సర్కార్ నిర్మించతలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన ఆరోపణలను ఖండించారు. శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ కుమార్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూనే ఉంటుందన్న ఆయన నీటి హక్కులు, ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.
గోదావరి-బనకచెర్ల అనుసంధాన పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేవలం కేంద్రానికి ప్రతిపాదన మాత్రమే సమర్పించారని స్పష్టం చేశారు. ఇప్పటికే 200 టీఎంసీల నీటిని తరలించామని హరీశ్‌రావు బూటకపు ప్రకటనలు చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరం తెలుపుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాశామని గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణంతో ఇబ్బందులు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కూడా లేఖ రాశామని.. ఆ లేఖను విడుదలు చేస్తున్నామన్నారు. బనకచర్ల ప్రాజెక్టును తాము అంగీకరించట్లేదని కేంద్రానికి, ఏపీ ప్రభుత్వానికి ఖరాఖండీగా చెప్పామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు.
కృష్ణా జలాల్లో 70 శాతం వాటా తెలంగాణకు ఇవ్వాలని 2015లోనే తాము కోరామన్నారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం 299 టీఎంసీలు చాలని ఒప్పుకున్నారని ప్రతిపక్ష పార్టీ నేతలకు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాల్లో నష్టం జరిగేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసిన పొరపాట్లను ఒక్కొక్కటిగా సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. హరీష్ రావు ఇష్టానుసారంగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ ధ్వజమెత్తారు. చిల్లర రాజకీయాలు చేయొద్దని హరీష్‌రావు కు హితవు పలికారు. బీఆర్ఎస్ పాలనలోనే నదీ జలాల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు.తాము అధికారంలోకి వచ్చాక ఆ నష్టాన్ని పూడ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.