కంపెనీ యొక్క గ్లోబల్ నిర్వహణ మోడల్ మరియు విస్తృత స్థాయి ఆవిష్కరణల సామర్థ్యాలను మరింత పటిష్టం చేయనున్న కొత్త కేంద్రం
హైదరాబాద్: అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెల్త్ మేనేజ్‌మెంట్ దిగ్గజం ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ (Nasdaq: LPLA), భారత్‌లోని హైదరాబాద్‌లో తమ ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ని లాంఛనంగా ప్రారంభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎల్‌పీఎల్ నాయకత్వ బృందంలోని సీనియర్ సభ్యులతో పాటు ప్రభుత్వం, ఆర్థిక సేవల పరిశ్రమ నుంచి పలువురు దిగ్గజాలు పాల్గొన్నారు. గ్లోబల్ టెక్నాలజీ, నిర్వహణ సామర్థ్యాలు, ఆవిష్కరణలపై కంపెనీ చేస్తున్న పెట్టుబడులకు సంబంధించి ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుంది.
హైదరాబాద్‌లో అధునాతన మౌలిక సదుపాయాలతో పాటు ఆర్థిక సేవలు, సాంకేతికత, కృత్రిమ మేథ, ఆటోమేషన్, క్లౌడ్ ఇంజినీరింగ్‌లో అపార అనుభవం గల ప్రతిభావంతుల లభ్యత గణనీయంగా ఉండటమనేది జీసీసీ కోసం నగరాన్ని ఎంచుకునేందుకు కీలకాంశాలుగా నిల్చాయి.
ఫార్చూన్ 500 కంపెనీ అయిన ఎల్‌పీఎల్, అమెరికాలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వెల్త్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. 32,000 మందికి పైగా ఫైనాన్షియల్ అడ్వైజర్లకు, దాదాపు 1,200 ఆర్థిక సంస్థల వెల్త్ మేనేజ్‌మెంట్ విధానాలకు తోడ్పాటు అందిస్తోంది. సుమారు 80 లక్షల మంది అమెరికన్ల తరఫున దాదాపు 2.4 లక్షల కోట్ల డాలర్ల అసెట్స్‌ని నిర్వహిస్తోంది.
ఎల్‌పీఎల్ ప్రధాన వ్యాపారం అమెరికా కేంద్రీకృతమైనదే అయినప్పటికీ, టెక్నాలజీ, నిర్వహణ, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, డేటా మరియు అనలిటిక్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ సహా సంస్థకు సంబంధించిన కీలక కార్యకలాపాలకు హైదరాబాద్‌లోని ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ తోడ్పాటు అందిస్తుంది. ఎల్‌పీఎల్ యొక్క గ్లోబల్ కార్యకలాపాల నిర్వహణలో భాగంగా, అడ్వైజర్ మరియు క్లయింట్ సపోర్ట్‌ని మరింత మెరుగుపర్చేందుకు, ఆవిష్కరణలను వేగవంతం చేసేందుకు, ప్లాట్‌ఫాం స్థిరత్వాన్ని, నిర్వహణ సామర్థ్యాలను పటిష్టం చేసుకునేందుకు జీసీసీ సహాయకరంగా ఉండనుంది.
గ్లోబల్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా హైదరాబాద్‌కి పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా జీసీసీ ప్రారంభ కార్యక్రమంలో గౌరవనీయ ఐటీ శాఖ మంత్రి శ్రీ. డి. శ్రీధర్ బాబుతో పాటు ఎల్‌పీఎల్‌కి చెందిన అమెరికన్ సీనియర్ నాయకత్వం, ఇతరత్రా ఆర్థిక పరిశ్రమ దిగ్గజాలు పాల్గొన్నారు.
“ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇదొక సంతోషకరమైన విషయం. జీసీసీ హబ్ స్థాయి నుంచి అంతర్జాతీయంగా వేల్యూ క్రియేషన్ వ్యవస్థ స్థాయికి ఎదిగే క్రమంలో, ఇలాంటి సానుకూలాంశాలు, హైదరాబాద్‌ని వెల్త్ మేనేజ్‌మెట్ మరియు ఆర్థిక సర్వీసులు, ఆవిష్కరణలకు దిగ్గజ గ్లోబల్ కేంద్రంగా తీర్చిదిద్దాలన్న తెలంగాణ విజన్‌ను సాకారం చేసేందుకు తోడ్పడతాయి” అని తెలంగాణ ఐటీ, ఈ&సీ, ఇండస్ట్రీస్ & కామర్స్, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి డి. శ్రీధర్ బాబు తెలిపారు. “ఈ కార్యక్రమం, ఒక కొత్త సెంటర్‌ని ప్రారంభించడానికి మాత్రమే పరిమితమైనది కాదు. మరింత చురుకైన, విస్తృతంగా విస్తరించతగిన, ఆవిష్కరణల ఆధారితమైన సంస్థగా కంపెనీని తీర్చిదిద్దుకునే ప్రస్థానంలో ఇదొక కీలక ముందడుగు” అని ఎల్‌పీల్ ఫైనాన్షియల్ చీఫ్ టెక్నాలజీ మరియు ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ గ్రెగ్ గేట్స్ తెలిపారు. “హైదరాబాద్‌లోని ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఒక చోటికి చేర్చడం ద్వారా మేము మా ప్లాట్‌ఫాంను మరింత పటిష్టం చేసుకోవడంతో పాటు మా అడ్వైజర్లు మరియు క్లయింట్లకు మరింతగా తోడ్పాటు అందించేలా కొత్త తరం సామర్థ్యాలను సంతరించుకునే ప్రక్రియను వేగవంతం చేసినట్లవుతుంది” అని వివరించారు.
“హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ని ప్రారంభించడమనేది మాకు ఎంతో గర్వకారణమైన సందర్భం. అలాగే ప్రాంతీయ వ్యవస్థ, ప్రతిభావంతులపై ఎల్‌పీఎల్‌కి గల నమ్మకానికి నిదర్శనం. అమెరికా ఆధారిత వ్యూహాన్ని అమలు చేస్తూ, ఎల్‌పీఎల్ యొక్క పీపుల్-ఫస్ట్ సంస్కృతి మరియు గ్లోబల్ ప్రమాణాలకు అనుగుణంగా పని చేస్తూ, రాబోయే మూడు నుంచి అయిదేళ్ళ వ్యవధిలో వ్యాపారాలు, ప్రోడక్ట్ డెవలప్‌మెంట్, టెక్నాలజీ, కార్యకలాపాలకు తోడ్పడే సిబ్బంది దన్నుతో ఈ కేంద్రం ఒక కీలకమైన కేపబిలిటీ హబ్‌గా ఎదుగుతుందని ఆశిస్తున్నాం” అని ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ మరియు కంట్రీ హెడ్ రమేష్ కాజ తెలిపారు.
నానక్‌రాంగూడలోని ప్రెస్టీజ్ స్కై టెక్, టవర్ 1లోని జీసీసీ యొక్క తాత్కాలిక కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. 2027 తొలినాళ్లలో టవర్ 2లోని పర్మనెంట్ కార్యాలయంలోకి కార్యకలాపాలను బదలాయించే ప్రణాళికల్లో జీసీసీ ఉంది.
కెరియర్లు
భారత్‌లోని ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌లో అవకాశాల కోసం ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ LinkedIn పేజీ మరియు ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కెరియర్స్ సైట్ ని సందర్శించగలరు.