నేతాజీ నగర్ లో ఆధ్యాత్మిక శోభ.. ఘనంగా నవరాత్రి ఉత్సవాలు
ముద్ర న్యూస్ బ్యూరో : హైదరాబాద్: మెహిదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నేతాజీ నగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో కాలనీకి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను గుర్తించిన కాలనీవాసులు గత పది సంవత్సరాలకు పైగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టిస్తూ వస్తున్నారు.

పూర్తిగా ఆధ్యాత్మిక చింతన తో కూడిన కార్యక్రమాలను మండపంలో నిర్వహిస్తున్నారు. ప్రముఖ ప్రవచనకర్త మల్లిఖార్జున శర్మ మూడు రోజులపాటు వివిధ పౌరాణిక సామాజిక అంశాలపై ప్రవచనాలు ఇచ్చారు. కాలనీకి చెందిన బాల బాలికలు సంగీత నాట్య ప్రదర్శనలతో భక్తులను అలరించారు. వివిధ అంశాలపై స్కిట్స్ నిర్వహించారు. చిన్నారుల కోసం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. హనుమాన్ చాలీసా, భగవద్గీత సామూహిక పఠనాలతో గణేష్ మండపం మార్మోగింది. ప్రధాన పూజారి కేశవ మూర్తి నిత్య పూజలు నిర్వహించారు.

బుధవారం నిర్వహించిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో సుమారు 1500 మంది పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. శుక్రవారం నాడు బొజ్జ గణపయ్యను కాలనీలోని వీధుల్లో ఊరేగించిన తర్వాత శ్రీ ఉమామహేశ్వర సీతారామ అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని మహాశివుని విగ్రహ సన్నిధిలో నిమజ్జనం చేస్తారు.

నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, గణేష్ ఉత్సవ సమితి నాయకులు జి అప్పారావు, టీఎస్ ఆనందరెడ్డి, కే వి బి మురళీమోహన్, ఎం.వి రంగారెడ్డి, కే ప్రభాకర్, రవితేజ, శ్రీనివాస్, కే పద్మావతి, బి పుష్పావతి, కే శ్రీధర్ రావు, ఏ సత్యం బాబు, ఎల్ దామోదర్, పి రామేశ్వర్ రెడ్డి, బద్రీనాథ్, వేదవ్రత్, దేవాక్షిత్, చరణ్, సదానంద్, సాగర్, వెంకటేష్, భరత్ బృందం మండపం నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించింది. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారు చక్కటి ఏర్పాటు చేశారు.
