మహాదేవపూర్, ముద్ర:
సరస్వతి పుష్కరాల దృష్ట్యా అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను కోరారు. ముఖ్యంగా మ్యూజియం నిర్మాణ పనుల్లో ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సరస్వతి పుష్కర ఘాట్ వద్ద జరుగుతున్న స్టోన్ క్లాడింగ్ పనులను నెలాఖరు లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. కాళేశ్వరంలో ఆయన స్టోన్ క్లాడింగ్, పార్కింగ్ టైల్స్ మరియు మ్యూజియం నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల ప్రగతిని సమీక్షిస్తూ, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూనే వేగాన్ని పెంచాలని సూచించారు.
అలాగే, పార్కింగ్ సదుపాయాలు మరియు ఘాట్ పరిసరాల్లో మౌలిక వసతులు మెరుగుపరిచే పనులను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, ఇరిగేషన్ ఈ ఈ తిరుపతిరావు, ఆర్ అండ్ బి ఈ ఈ రమేష్, కాటారం డిఎస్పీ సూర్య నారాయణ, తహసీల్దార్, సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ రవీంద్ర నాథ్, దేవస్థానం ఈఈ మహేష్, సర్పంచ్ మోహన్ రెడ్డి, పిఏసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.