Take a fresh look at your lifestyle.

‘అంజన్న’ ఆశీర్వాద యాత్ర: ముగ్గురు కలిసినా బీజేపీదే విజయం..

 

– కొండగట్టు ఆశీర్వాద యాత్రలో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!
– 11 గంటల్లో 40 కి.మీలు నడిచిన కేంద్రమంత్రి
– మండుటెండను సైతం లెక్క చేయకుండా కొండగట్టుకు…
–మధ్యాహ్న భోజనం వద్ద ఒకసారి, తేనెటీగ దాడి సమీపంలో మరోసారి కొద్దిసేపు సేదదీరిన కేంద్ర మంత్రి
–సంజయ్ తో కలిసి అడుగులో అడుగు వేస్తూ నడిచిన కాషాయ శ్రేణులు
–దిగ్విజయంగా ముగిసిన ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర
–కరీంనగర్ నుండి కొండగట్టు దాకా…. కాషాయ శ్రేణుల సందడి

ముద్ర, కరీంనగర్:

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంటే, కరీంనగర్ నుంచి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరుతో భారీ పాదయాత్రను ప్రారంభించారు.

భారీగా తరలివచ్చిన కార్యకర్తలు
కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, బండి సంజయ్ సుమారు 40 కిలోమీటర్ల మేర సాగే ఈ మహా పాదయాత్రను చేపట్టారు. ఎండను సైతం లెక్కచేయకుండా దాదాపు 10 వేల మందికి పైగా బీజేపీ కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, హనుమాన్ భక్తులు ఆయనతో కలిసి నడిచారు. పది తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ యాత్రను కొనసాగిస్తున్నారు.

రాజకీయ సంచలనం: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంలపై విమర్శలు
ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు:

అపవిత్ర పొత్తు: తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు లోపాయకారి ఒప్పందం చేసుకున్నాయని, ఎంఐఎంతో కూడా రహస్య మంతనాలు సాగిస్తున్నాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఒక్కటైనా వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీజేపీనేనని ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రిపై ధ్వజం: బీఆర్ఎస్ నేతలపై పలు కేసులు ఉన్నప్పటికీ అరెస్టులు చేయకపోవడం వెనుక వారి మధ్య ఉన్న బంధం స్పష్టంగా కనిపిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డికి కల్వకుంట్ల కుటుంబాన్ని అరెస్టు చేసే ధైర్యం లేదని విమర్శించారు.

డబుల్ ఇంజన్ సర్కార్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటుతుందని, త్వరలోనే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్’ సర్కార్ రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

పాదయాత్రలో అపశ్రుతి
యాత్ర కొనసాగుతుండగా రామడుగు మండలం వెదిర వద్ద స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. పాదయాత్రను చిత్రీకరించే క్రమంలో డ్రోన్ కెమెరా అనుకోకుండా చెట్టుకు ఉన్న తేనెతుట్టెను తాకడంతో తేనెటీగలు దాడి చేశాయి. అప్రమత్తమైన బండి సంజయ్ గాయపడిన కార్యకర్తలకు వెంటనే వైద్య సహాయం అందేలా చూసి, ఆ తర్వాత యాత్రను తిరిగి ప్రారంభించారు.

ప్రస్తుతం ఈ యాత్ర కరీంనగర్ నుండి కొండగట్టు వైపు వేలాది మంది అభిమానుల మధ్య ఆధ్యాత్మిక మరియు రాజకీయ ఉత్సాహంతో కొనసాగుతోంది.

‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ బీజేపీ ప్రజాప్రతినిధులతో చేపట్టిన ఒకరోజు పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మేయర్ పీఠాన్ని అప్పగిస్తే తన పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టు అంజన్న సన్నిధికి కాలినడకన వచ్చి మొక్కులు చెల్లించుకుంటానంటూ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. 11 గంటల్లో ఏకబిగిన దాదాపు 40 కిలోమీటర్ల మేర నడిచి కొండగట్టుకు చేరుకున్నారు దాదాపు 40 డిగ్రీల మండుటెండను సైతం లెక్క చేయకుండా…మధ్యలో చిన్న అవాంతరాలు ఎదురైనా, తేనెటీగలు హంగామా స్రుష్టించినా అదరకుండా బెదరకుండా అన్నీ అధిగమిస్తూ అంజన్న ఆలయ సన్నిధికి చేరుకున్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, ఉప సర్పంచులు, సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్, మేయర్ తో కలిసి అంజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.

*యాత్ర ప్రారంభమైందిలా…. *
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు ఢిల్లీ నుండి బయలుదేరి అర్ధ రాత్రి 1.30 గంటలకు కరీంనగర్ కు చేరుకున్నారు. మరుసటి ఉదయం 6 గంటలకే లేని రడీ అయ్యి 7 గంటలకే కరీంనగర్ మహాశక్తి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారి ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడి నుండే అంజన్న ఆశీర్వాద యాత్రను ప్రారంభిస్తున్న మీడియాతో మాట్లాడారు. అక్కడికి చేరుకున్న నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోపాటు వేలాది మంది కాషాయ శ్రేణులతో కలిసి కాలినడకన బయలుదేరారు.

బూట్లు లేకుండా సాక్సులతోనే మండుటెండలో నడిచిన బండి
రాజకీయాలకు అతీతంగా చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర కావడంతో…బండి సంజయ్ పాదయాత్రలో బూట్లు వేసుకోలేదు. సన్నిహితులు ఎంత ఒత్తిడి చేసినా బూట్లు వేసుకునేందుకు ససేమిరా అన్నారు. కేవలం సాక్సులతోనే నడక ఆరంభించారు. మండుటెండలో తారు రోడ్డుపై చెప్పులు లేకుండా కొద్దిదూరం నడవాలంటేనే ఇబ్బందిగా ఉంటుంది. కానీ అవేవీ లేకుండా వట్టి సాక్సులతోనే ఏకంగా 40 కి.మీల మేరకు బండి సంజయ్ నడవడం అందరినీ విస్మయానికి గురి చేసింది.

టెన్తు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా…ట్రాఫిక్ జాం కాకుండా యాత్ర

ఈరోజే టెన్త్ పరీక్షలు ప్రారంభం కావడం, 9.30 గంటలకే టెన్త్ పరీక్ష ఆరంభం కావడం… అదే సమయంలో బండి సంజయ్ చేపట్టిన పాదయాత్ర కరీంనగర్ జగిత్యాల హైవేపైకి రావడంతో ట్రాఫిక్ జాం అవుతుందనే ఆందోళన కన్పించింది. కానీ బండి సంజయ్ వేలాది మంది కాషాయ దండుతో హైవేకు ఒకవైపు మాత్రమే… క్రమశిక్షణతో అటు పాదయాత్ర రక్షక దళం, ఇటు పోలీసుల సాయంతో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా పాదయాత్రను కొనసాగించడం విశేషం. ఈ విషయంలో పోలీసులకు పూర్తిగా సహకరించాలని, ఏ ఒక్క విద్యార్ధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని పదేపదే బండి సంజయ్ కోరడం గమనార్హం. ఫలితంగా విద్యార్థులకు, వాహనదారులకు పెద్దగా ఇబ్బంది లేకుండా హైవేపై సాఫీగా పాదయాత్ర సాగింది.

కోన్ రావుపేటలో తేనెటీగల కలకలం…లెక్క చేయని బండి సంజయ్

అసలే ఎండా కాలం… 40 డిగ్రీల దాకా ఎండ. మధ్యాహ్నం చెమటలు కక్కుతున్నా లెక్క చేయకుండా బండి సంజయ్ జోష్ తో నడవటం చూసి కాషాయ శ్రేణులంతా మేము సైతం అంటూ అడుగులో అడుగు వేసుకుంటూ కదం తొక్కారు. రామడుగు మండలం కోన్ రావుపేట వద్దకు రాగానే.. అక్కడ భారీ ఎత్తున జనం రావడం….భారీ ఎత్తున డీజే సౌండ్ తో కోలాహలం నెలకొనడం… ఆ జోష్ లో కొందరు కార్యకర్తలు డ్రోన్ ఎగరేయడం… అక్కడే చెట్టుపైనున్న తెనేతుట్టె కదిలి అందులోనుండి తేనెటీగలు బయటకు రావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. తేనెటీగల దాడిలో ముగ్గురు కార్పొరేటర్లు, మరో ముగ్గురు కాషాయ శ్రేణులు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స ఇప్పించారు. అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ మాత్రం తేనెటీగల దాడి చేయకుండా అప్రమత్తమయ్యారు. కాసేపు రోడ్డు పక్కనే ఉన్న బెంచిపై ఆగి సేదదీరారు. పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన అంబులెన్సులో ఉన్న డాక్టర్లు వచ్చి బండి సంజయ్ ను రోటీన్ హెల్త్ చెకప్ చేశారు. కొద్ది నిమిషాల తరువాత అంతా సద్దుమణగడంతో మళ్లీ బండి సంజయ్ తన పాదయాత్రను యాధావిథిగా కొనసాగించారు.

గంగాధరలో లంచ్…సాయంత్రం తిరిగి యాత్ర ఆరంభం

రామడుగు మండలం కోన్ రావుపేట నుండి బయలుదేరిన పాదయాత్ర కురిక్యాల మీదుగా మధ్యాహ్నం 3.30 గంటలకు గంగాధర మండల కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ స్థానిక వీఏఎస్ ఫంక్షన్ హాలులో బీజేపీ శ్రేణులందరికీ మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. బండి సంజయ్ సైతం అక్కడే ఓ కార్యకర్త ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి కాసేపు సేద దీరారు. సాయంత్రం 5.30 గంటలకు తిరిగి పాదయాత్రను ప్రారంభించిన బండి సంజయ్ వెంకటాయపల్లి, పూడూరు మీదుగా కొండగట్టుకు చేరుకున్నారు. సాయంత్రం 7 గంటలకు దొంగలమర్రి x రోడ్ వద్దకు చేరుకున్నారు.

నోట్ :-
దొంగల మర్రి నుండి రాత్రి 7.30 గంటల వరకు కొండగట్టు అంజన్న ఆలయం వద్దకు చేరుకుని ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ను దిగ్విజయంగా ముగించనున్నారు. అనంతరం బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇచ్చిన మాట ప్రకారం ఆంజనేయస్వామికి మొక్కులు చెల్లించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.