Take a fresh look at your lifestyle.

హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా జేఏసీ ఉద్యమానికి ఎంపీ ఈటల మద్దతు

 

ముద్ర, కరీంనగర్:
హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రజా ఉద్యమానికి ఎంపీ ఈటల రాజేందర్ మద్దతు ప్రకటించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) చేపట్టిన ధర్నాలో ఆయన పాల్గొని, ప్రజల ఆందోళనకు తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో హుజురాబాద్ మరియు పరిసర గ్రామాలు విషతుల్యమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఈ ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “రాజకీయాల కోసం కాదు, ప్రజల సమస్యల కోసం వచ్చాను. ప్రజల జీవితం ప్రమాదంలో పడేలా చేసే నిర్ణయాలను అంగీకరించం” అని అన్నారు.

జవహర్‌నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డ్‌ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఉదాహరణగా చూపిస్తూ, అలాంటి పరిస్థితి హుజురాబాద్‌లో రావద్దని పేర్కొన్నారు. డంపింగ్ యార్డ్‌ల కారణంగా భూగర్భ జలాలు కలుషితమవడం, చెరువులు నాశనం కావడం, అనేక రకాల రోగాలు వ్యాపించడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు.

చెత్తను ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తి చేస్తామని చెప్పే యంత్రాలు ప్రాక్టికల్‌గా పనిచేయవని, అవి ప్రజలను మోసం చేసే ప్రయత్నమని విమర్శించారు. “ట్రీట్మెంట్ ప్లాంట్లు పేరుకే ఉంటాయి, కానీ నిర్వహణ సరిగా ఉండదు. రాత్రిపూట చెత్త నీటిని కాలువల్లో వదిలేస్తారు” అని ఆరోపించారు.

ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడే నిర్ణయాలను తీసుకోకూడదని హెచ్చరించారు. “డంపింగ్ యార్డ్‌ను నిలువరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. మాటలు కాదు, ఆచరణ కావాలి” అని స్పష్టం చేశారు.

ప్రజల పోరాటానికి తాను ఎప్పటికీ అండగా ఉంటానని, అవసరమైతే ఉద్యమానికి నాయకత్వం వహించేందుకు సిద్ధమని ఈటల రాజేందర్ వెల్లడించారు. “హుజురాబాద్ ఇచ్చిన పోరాట స్ఫూర్తితోనే నేను ఎప్పటికీ ప్రజల పక్షాన నిలుస్తాను” అని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.