Take a fresh look at your lifestyle.

యూనివర్సిటీ ఏర్పాటుపై సీఎం స్పష్టత ఇచ్చేనా?6 న జిల్లాలో సీఎం పర్యటన.

 
యూనివర్సిటి ఏర్పాటు స్పష్టతకై ఎదురుచూపు

బోథ్, ముద్ర:

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సోమవారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటుపై స్పష్టత కోసం జిల్లా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025 డిసెంబర్ 4న ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలంతా ఏకతాటిపైకి వచ్చి యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయం తీసుకొని ప్రభుత్వ సలహాదారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఇంద్రవెల్లి లో ఏర్పాటు చేస్తే బాగుంటుందనేది తన సూచనగా పేర్కొన్నారు. సీఎం ప్రకటనతో దశాబ్దాలుగా యూనివర్సిటీ ఏర్పాటు కోసం ఎదురుచూస్తున్న జిల్లా వాసుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ ప్రాంత విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల నేతలతో యూనివర్సిటీ సాధన సమితిని ఏర్పాటు చేసుకొని విసృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు ప్రజా ప్రతినిధులను, ఉన్నత అధికారులను సైతం కలిశారు. కాగా మరోమారు 2026 జనవరిలో సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా నిర్మల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీని బాసర లో ఏర్పాటు చేస్తే సౌలభ్యంగా ఉంటుందని చెప్పటం అందరిని విస్మయానికి గురి చేసింది. దీంతో యూనివర్సిటీ ఏర్పాటు నిర్మల్ జిల్లా బాసర లోనా లేక ఆదిలాబాద్ జిల్లాలోనా అనే అంశంపై నేటికి స్పష్టత లేదు. సోమవారమైన ఈ అంశపై సీఎం స్పష్టత ఇస్తారని ఆశిస్తున్నారు.
యూనివర్సిటీ లేని ఏకైక జిల్లాగా ఆదిలాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని పాత పది జిల్లాలలో ప్రస్తుతం యూనివర్సిటీ లేని ఏకైక జిల్లాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిలిచింది. యూనివర్సిటీ లేకపోవడంతో జిల్లా వాసులు ఉన్నత చదువుల కోసం అష్టకష్టాల నడుమ ఉమ్మడి జిల్లాను దాటి వేరే జిల్లాలకు వెళ్తున్నారు. మరికొంతమంది ఆర్థిక భారం, దూర భారం వల్ల మధ్యలోనే చదువులకు స్వస్తి పలుకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉండడంతో పాటు గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. 2008 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అదే ఏడాది నవంబర్ 17 న జీవో 797 ను విడుదల చేసింది. ఉట్నూర్ లో భూమిని సైతం గుర్తించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల ఆది ములుగు జిల్లాకు తరలి పోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఏర్పాటు అవుతుందనుకున్న మైనింగ్ యూనివర్సిటీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏర్పాటు చేశారు. ఇలా జిల్లాలో ఏర్పాటు అవుతాయనుకున్న యూనివర్సిటీలు ఒక్కోటి వేరే జిల్లాలకు తరలిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్యా అవకాశాలు అందుతాయని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.