ఏఐసీసీ కార్యాలయం, సోనియా నివాసం ముట్టడికి యత్నం
భివండీలో రాహుల్ కు నిరసన సెగ
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ఈ నెల 20న ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ప్రాంగణంలో యూత్ కాంగ్రెస్ చేసిన నిరసనకు వ్యతిరేకంగా బీజేపీ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ నివాసం ముట్టడికి బీజేపీ నేతలు యత్నించారు. భారీ సంఖ్యలో చేరుకున్న బీజేపీ నాయకులు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బారికేట్లను దాటి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రజలకు రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని ఆయనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఆందోళనలతో అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. మరొవైపు రాహుల్ గాంధీకి ముంబయిలో నిరసన సెగతగిలింది. 2014 లో ఆర్ఎస్ఎస్ వేసిన పరువు నష్టం కేసులో శనివారం ఆయన భింవాడీ అదనపు సెషన్స్ కోర్టు ముందు హాజరయ్యారు. ఆయన ముంబయి ఎయిర్ పోర్టు నుంచి కోర్టుకు వెళ్లే దారి పొడుగునా బీజేపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశాయి. నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. అలాగే హైదారాబాద్ నాంపల్లిలోని గాంధీభవన్ వద్ద బీజేపీ నేతలు నిరసనలు వ్యక్తం చేశారు. గాంధీభవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు, కార్యకర్తలు విఫలయత్నం చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ గాంధీ భవన్ వైపు దూసుకొచ్చారు. దాంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీసు స్టేషన్లకు తరలించారు.