ముద్ర, నారాయణపేట :
లక్ష్యం ఉంటే సాధించనిదంటూ ఏదీ లేదని కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మిషన్ వాత్సల్య (పథకం) కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…చిన్న చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు దేశంలో అత్యున్నత పదవులు పొందారని, విద్యార్థులు వారిని స్పూర్తిగా తీసుకోవాలన్నారు. కష్టపడి చదివితే మీరు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారని చెప్పారు. సంకల్పం తీసుకున్నాక ఏ రోజు ఏం చేయాలనే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని సూచించారు. చదువును అశ్రద్ద చేయవద్దని తెలిపారు. బాల సదనం, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులతో మాట్లాడి భవిష్యత్తులో ఎవరెవరు ఏం అవుతారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం అనాథ పిల్లలకు డీ సీ పీ యూ స్టాఫ్ సహాయంతో తీసుకువచ్చిన జనన ధృవీకరణ, ఆదాయ ధృవీకరణ , కుల ధృవీకరణ, బ్యాంకు ఖాతా పత్రాలను, చిల్డ్రన్ హోమ్ పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డ్స్ ని కలెక్టర్ పిల్లలకు అందజేశారు.