కురుమూర్తి స్వామి దేవస్థాన నూతన పాలకమండలి ప్రమాణస్వీకారం -కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు జి. మధుసూదన్ రెడ్డి, డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్
దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంట మండలంలో నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని నూతనంగా ఎన్నికైన చైర్మన్ బత్తుల బాలరాజ్‌తో పాటు పాలకమండలి సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి మాట్లాడుతూ కురుమూర్తి స్వామి ఎంతో మహిమగల దేవుడని, భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. దేవుడి ఆశీస్సులతో తాను నాలుగు సార్లు ఇక్కడికి రావడం జరిగిందని, నూతన పాలకమండలి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.
కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా దేవస్థానానికి తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
భక్తుల సౌకర్యార్థం ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ.110 కోట్ల నిధులు మంజూరు చేశారని, పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. త్వరలో పనులు పూర్తై బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు.
నూతన పాలకమండలి సభ్యులు భక్తులకు అందుబాటులో ఉండాలని కోరుతూ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీమతి స్వర్ణ సుధాకర్ రెడ్డి, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.