అమెరికాలో జరిగిన సదస్సులో తన పరిశోధనను వివరిస్తున్న పవన్ కుమార్
రాజేంద్రనగర్, ముద్ర ప్రతినిధి:
నేటి తరంలో విద్యుత్ వాహనాల ఉపయోగానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. తక్కువ ఖర్చులో ఎక్కువ దూరం ప్రయాణించడంతోపాటు, కాలుష్య రహిత వాహనాలు కావడంతో వీటి డిమాండ్ పెరిగిపోయింది. భవిష్యత్తు ఈ బ్యాటరీ వాహనాలదే అయిన అకస్మాత్తుగా బ్యాటరీలు ఫెయిల్ కావడం, పలుమార్లు వాహనాల బ్యాటరీలు పేలిపోవడం లాంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. బ్యాటరీ ప్రమాదాలను ముందుగానే పసిగట్టి, బ్యాటరీ పనితీరు మెరుగుపరచడం కోసం మన తెలుగు విద్యార్థి అమెరికాలో ప్రదర్శన ఇస్తూ సత్తా చాటారు.

విజయవాడకు చెందిన పవన్ కుమార్ కారెడ్ల లంగర్ హౌస్ లోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో అభ్యసించాడు. ప్రస్తుతం ఇతను అమెరికాలోని టయోటా ఉత్తర అమెరికాలో నియో సాఫ్ట్ ఐ ఎన్ సి లో ఉద్యోగం చేస్తూ బ్యాటరీ జీవన పరిమాణాన్ని పెంపొందించడంలో వాసవి కళాశాల ప్రొఫెసర్ల సహకారంతో పరిశోధనలు విస్తృతంగా చేస్తున్నారు . అమెరికాలోని డెట్రాయిట్‌లో గత నాలుగు రోజుల క్రితం జరిగిన ఎస్ ఏ ఈ డబ్ల్యూ సి ఎక్స్ ప్రపంచ కాంగ్రెస్ అవగాహన 2026 సదస్సులో ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పరిశోధనను ప్రదర్శించారు. ఈ పరిశోధనలో విద్యుత్ వాహనాల నెట్‌వర్క్‌లలో కేబుల్ రహిత కమ్యూనికేషన్ సవాళ్లను పరిగణనలోకి తీసుకుని బ్యాటరీల మిగిలిన జీవితకాలాన్ని రియల్-టైమ్‌లో అంచనా వేయగల సాంకేతికతను అభివృద్ధి చేసి ఆయన ప్రదర్శించారు., ఇది బ్యాటరీ పనితీరును ముందుగానే పసికట్టి మరింత సమర్థవంతంగా తీర్చుకునేలా మరమ్మతులు చేసుకునేలా ఉపయోగపడుతుందని పవన్ కుమార్ తెలిపారు. ఈ ప్రదర్శనతో ఆయనకు ఐ ఈ ఈ ఈ సీనియర్ సభ్యులుగా గౌరవం లభించింది. సదస్సులో పోస్టర్ ప్రదర్శనలు మరియు సాంకేతిక ఆధారిత ప్రసంగంతో పాల్గొన్న ఈ పరిశోధనకు హైదరాబాద్‌లోని వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌తో అకాడమిక్ అనుబంధం ఉంది. ప్రపంచ దేశాలకు పోటీగా తన ప్రతిభను చాటుతున్న పవన్ కుమార్ కు వాసవి కళాశాల యాజమాన్యం రామ్మోహన్ రావు , ప్రిన్సిపల్ రమణలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అభినందనలు తెలియజేశారు.