Take a fresh look at your lifestyle.

సురక్షిత మాతృత్వంతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యం: టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి

 

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి:

సురక్షిత మాతృత్వంతోనే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న హెల్త్ వీక్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం మెడికల్ కళాశాల సమావేశ మందిరంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో “సేఫ్ మదర్ డే” కార్యక్రమం నిర్వహించారు.
ఈసందర్భంగా గర్భిణీలకు అవసరమైన ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించడంతో పాటు ఏఎన్‌సీ చెకప్‌లు మాతృ మరణాల రేటు తగ్గించడం సి-సెక్షన్,హై రిస్క్ గర్భధారణలు,అత్యవసర పరిస్థితులు,పీసీపీఎన్‌డీటీ చట్టం వంటి అంశాలపై డాక్టర్లకు వర్క్‌షాప్ నిర్వహించారు.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈసందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, తల్లి–బిడ్డల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వైద్య సదుపాయాలను అందిస్తున్నదన్నారు. గర్భధారణ ప్రారంభం నుంచే క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, రక్తహీనత నివారణకు పోషకాహారం తీసుకోవాలని సూచించారు.పుట్టబోయే శిశువు ఆరోగ్యంగా ఉండేందుకు వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు.చిన్న వయసులో గర్భధారణ వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశమున్నందున మైనర్ బాలికల వివాహాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ,సురక్షిత ప్రసవాలు మరియు తల్లి–శిశు ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భధారణ సమయంలో సమయానుకూల వైద్య పరీక్షలు,టీకాలు,పోషకాహారం ద్వారా తల్లి మరియు శిశువు ఆరోగ్యాన్ని కాపాడవచ్చన్నారు.సమగ్ర ప్రణాళికతో పనిచేసి మాతృ మరణాల రేటును జీరోకు తీసుకురావడానికి కృషి చేయాలని తెలిపారు.
కొత్తగా తల్లులైన మహిళలకు అవసరమైన జాగ్రత్తలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.ప్రతి ఆసుపత్రి స్థాయిలో ఆశా,ఏఎన్‌ఎంల ద్వారా మండల సమాఖ్య మహిళలకు తల్లి–బిడ్డల సురక్షితంపై వర్క్‌షాప్‌లు నిర్వహించి గర్భిణులకు సమగ్ర సమాచారం చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే పీసీపీఎన్‌డీటీ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాతా,శిశు ఆరోగ్య పరిరక్షణ,సురక్షిత ప్రసవాల ప్రాముఖ్యతపై విస్తృతంగా అవగాహన కల్పించారు.ఈసందర్భంగా సేఫ్ మదర్ హుడ్ పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈకార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వసంత్ రావు,జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. మురళీకృష్ణ,డీసీహెచ్ఎస్ డా. కవిత,ప్రోగ్రాం అధికారులు డా.నాగనిర్మల,డా.శశాంక్ , డాక్టర్లు,మెడికల్ ఆఫీసర్లు, గర్భిణీలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.