Take a fresh look at your lifestyle.

నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి

 

ముద్ర పెబ్బేర్:

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని బుధవారం వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఘనంగా ప్రారంభించారు.

రిబ్బన్ కట్ చేసి కార్యాలయంలోకి అడుగుపెట్టి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయం పక్కనే రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన ఇందిరమ్మ నమూనా గృహంలో ఏర్పాటుచేసిన గృహ నిర్మాణ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ కార్యాలయాన్ని కూడా ప్రారంభించారు.అదేవిధంగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో రూ. 88 లక్షల వ్యయంతో చేపట్టనున్న అదనపు మౌలిక సదుపాయాల నిర్మాణ పనులకు శంకుస్థాపన, భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఏర్పడిన మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు.ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో జిల్లాలోని పలు మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాలు అద్దె భవనాల నుంచి సొంత భవనాలకు మారడం సంతోషకరమన్నారు.ఇప్పటికే ఏదుల, రేవల్లి మండల కేంద్రాల్లో నూతన తహసిల్దార్ కార్యాలయ భవనాలను ప్రారంభించుకోవడం జరిగిందని తెలిపారు.ఈ తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణం కోసం ఒక్కో భవనానికి రూ.32 లక్షలను కలెక్టర్ తన సొంత నిధుల నుంచి కేటాయించి వేగంగా పూర్తి చేయించడం అభినందనీయమని తెలిపారు.ఈ కొత్త భవనాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, సర్పంచి మద్దిలేటి, డీఈఓ అబ్దుల్ ఘని, బి డబ్ల్యు సుధారాణి, తాసిల్దార్ వరలక్ష్మి, మాజీ జెడ్పిటిసి రాజేంద్రప్రసాద్, నాయకులు శ్రీహరిరాజు, బీరం రాజశేఖర్ రెడ్డి,ఇతర అధికారులు తదితరులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.