Take a fresh look at your lifestyle.

బాలల భద్రత, రక్షణలో అగ్రగామిగా నిలవాలి

ముద్ర ప్రతినిధి, మెదక్:
బాలల భద్రత, రక్షణ, మాదకద్రవ్యాలకు వ్యతిరేక సంక్షేమ వారం పురస్కరించుకొని సోమవారం జిల్లా కేంద్రంలోని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మెదక్ ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో యువతకు సంరక్షణ అనంతరం మద్దతు, చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ నుండి బయటకు వచ్చే 18 సంవత్సరాలు పైబడిన యువతకు మార్గదర్శనం, నివాసం, నైపుణ్యాభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పనపై కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాస్ రావు బాలల హక్కుల ప్రదర్శన ప్రారంభించారు. బాలల సంరక్షణ భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. బాలల హక్కుల పరిరక్షణ పోస్టర్స్ ను ఆవిష్కరించారు.


కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ… బాలల భద్రత సంరక్షణ మరియు మత్తు పదార్థాల నివారణపై జిల్లాను అగ్రగామిగా నిలపాలని తెలిపారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలపై నిత్యం పర్యవేక్షణ కలిగి ఉండాలని, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ బాలల రక్షణకు కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.
సమాజంలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగం యువతపై ప్రతికూల ప్రభావం చూపుతోందని, డ్రగ్స్‌కు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు.
ఎస్పీ డివి శ్రీనివాసరావు మాట్లాడుతూ….
పిల్లల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వడంలో పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని, యువత చెడు వ్యసనాలు, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. బాలికలు, చిన్నారులపై ఎటువంటి సమస్యలు తలెత్తిన వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
గ్రంథాలయ చైర్ పర్సన్ చిలుమల సుహాసిని రెడ్డి మాట్లాడుతూ… బాలల సంరక్షణ భద్రత అనేది మనందరి బాధ్యత అని గుర్తు చేశారు. పురాతన కాలంలో ఉమ్మడి కుటుంబాలలో అమ్మమ్మలు, తాతయ్యలు చిన్నపిల్లలకు చేదోడుగా ఉంటూ మంచి, చెడు బోధించేవారని, తద్వారా సరైన అవగాహన, క్రమశిక్షణ గల జీవన శైలిలోపెరిగారన్నారు.
అనంతరం బాలల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో కలెక్టర్, ఎస్పీ ముచ్చటించారు. వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరఫున బాలల సంరక్షణ కేంద్రంలో అన్ని రకాల వసతులు కల్పించడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి హేమ భార్గవి, ఆర్టీసీ డిఎం సురేఖ, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఏఆర్ ఎడ్యుకేషన్ సొసైటీ  ఎన్జీవో సునీత, అంగన్వాడి, సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.