- టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు సాంబయ్య.
యైటింక్లయిన్ కాలనీ. ముద్ర: రాష్ట్ర మాజీ మంత్రి, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు గురువారం సింగరేణి ఓసీపీ.1 ప్రాజెక్టులో ఘనంగా జరిగాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు ఏరియా కమిటీ సభ్యులు ఉదయం ప్రాజెక్టు ఆవరణలో ఏర్పాటుచేసిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏరియా ఉపాధ్యక్షులు నాగేల్లి సాంబయ్య తోటి నాయకులను కలుపుకొని కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువతరానికి స్ఫూర్తిగా నిలిచే నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రిగా వ్యవహరిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తూ, రాష్ట్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైపల్యాలను ఎండగడుతూ, బీఆర్ఎస్ పార్టీతో పాటు అనుబంధ సంఘం టీబీజీకేఎస్ సభ్యులకు అండగా నిలిచి, కాంగ్రెస్ పార్టీనీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయించేందుకు, అలాగే ఇతర అనేక ప్రజా సమస్యల పరిష్కారం కొరకు ప్రజల పక్షాన రాజీలేని పోరాటాన్ని సాగిస్తున్నారన్నారు. ప్రజా నాయకుడైనా కేటీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని నాయకులు ఆకాంక్షించారు. ఇంకా ఈ వేడుకల్లో నాయకులు పింగిలి సంపత్ రెడ్డి, అల్లం తిరుపతి, ప్రవీణ్, కొండ రవి, రవీందర్, కుంట సత్తి, స్థానిక కార్మికులు పాల్గొన్నారు.