Take a fresh look at your lifestyle.

కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: టీఎస్ యుటిఎఫ్

 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్;

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగులు సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. బోధన, బోధనేతర సిబ్బంది సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రాష్ట్ర స్థాయి దశల వారీ పోరాటంలో భాగంగా టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆర్. కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం. శ్రీధర్ శర్మ మాట్లాడారు. అనాధ, పాక్షిక అనాధ బాలికల కోసం నిర్వహిస్తున్న కేజీబీవీలు, బాలుర కోసం నిర్వహిస్తున్న యూఆర్ఎస్ పాఠశాలలు మరియు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు చాలా కాలంగా పరిష్కారం కాకుండా ఉన్నాయని ఆయన తెలిపారు. రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో అనేక పోరాటాల ఫలితంగా కొన్ని సమస్యలు మాత్రమే పరిష్కరించబడ్డాయని, ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటివరకు అమలు కాలేదని అన్నారు. గత సంవత్సరం 29 రోజుల సమ్మె సందర్భంగా ఉపముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో అంగీకరించిన అంశాలు కూడా ఇప్పటివరకు అమలుకు రాలేదని విమర్శించారు.

కేజీబీవీలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ స్థాయిలో ఐవోఈ పద్ధతిలో నాణ్యమైన విద్య అందిస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల వేతనాలు మాత్రం తక్కువగా ఉన్నాయని చెప్పారు. యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్షలో పనిచేస్తున్న సిబ్బందికి బేసిక్ పే అమలు చేస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఓలను ప్రిన్సిపల్స్‌గా, పీజీసీఆర్టీలను జేఎల్‌లుగా, సీఆర్టీ, పీఈటీ, సీఆర్‌పీలను ఎస్‌ఏలుగా పరిగణించి కనీస మూల వేతనం చెల్లించాలని కోరారు.

అలాగే ఉద్యోగులను క్రమబద్ధీకరించి హెల్త్ కార్డులు జారీ చేయాలని, కేర్ టేకర్లు మరియు హాస్టల్ వార్డెన్లను నియమించి నైట్ డ్యూటీ, ఇతర బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని డిమాండ్ చేశారు. పాఠశాల, కళాశాల ఉపాధ్యాయుల మాదిరిగానే సెలవులు, ఐచ్చిక సెలవులు వినియోగించే అవకాశం కల్పించాలని, రెండవ శనివారాన్ని సెలవుగా ప్రకటించాలని కోరారు.

అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాలపై సహేతుకమైన నిర్ణయం తీసుకొని బేసిక్ పే అమలు చేయాలని, లేనిపక్షంలో మార్చి 20న “ఛలో అసెంబ్లీ” కార్యక్రమం నిర్వహిస్తామని నాయకులు హెచ్చరించారు.

ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సి. తిరుపతయ్య, జిల్లా కార్యదర్శి ఆర్. లక్ష్మణ్, కె. రాజాబాయి, రాష్ట్ర కౌన్సిలర్ ఎం. కురుమయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. వెంకటయ్య, డి. శేషగిరి, కోటేశ్వర్, పి. వహీద్ ఖాన్ తదితరులతో పాటు కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.